Pradeep Ranganathan - Dude: డ్యూడ్.. కొత్త చర్చకు తెరలేపింది
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:20 AM
‘డ్యూడ్’ రూపంలో ఒక యూనవర్శల్ విజయాన్ని అందించిన డెబ్యూ డైరెక్టర్ కీర్తీశ్వరన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, ఈ చిత్రం ఒక సరికొత్త చర్చకు తెరలేపిందని నటుడు ప్రదీప్ రంగనాథన్ అన్నారు.
‘డ్యూడ్’ రూపంలో ఒక యూనవర్శల్ విజయాన్ని అందించిన డెబ్యూ డైరెక్టర్ కీర్తీశ్వరన్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, ఈ చిత్రం ఒక సరికొత్త చర్చకు తెరలేపిందని నటుడు ప్రదీప్ రంగనాథన్ అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తమిళం, తెలుగు భాషల్లో నిర్మించిన చిత్రం ‘డ్యూడ్’ ఈ నెల 17న విడుదలై ఘన విజయం సాధించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.95 కోట్ల మేర వసూళ్లు సాధించి రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళుతోంది. ప్రదీప్ రంగనాథన్‌కు హీరోగా హ్యాట్రిక్ విజయం. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించింది.
నిర్మాతలు నవీన్, రవిశంకర్ మాట్లాడుతూ ‘మా బ్యానరులో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకంటే డిఫరెంట్ చిత్రాన్ని అందించిన యువ దర్శకుడు కీర్తీశ్వరన్‌కు, ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మాకు తమిళంలో తొలి చిత్ర విజయం. చాలా ఆనందంగా ఉంది అన్నారు.
దర్శకుడు కీర్తీశ్వరన్ మాట్లాడుతూ ‘కథ విన్న మరుక్షణమే ఈ సినిమా చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కొత్త దర్శకుడనే చిన్నచూపు చూడకుండా నా కంటూ ప్రత్యేకస్థానం ఇచ్చి, కంఫర్ట్ జోన్‌లో ఉంచిన దర్శకులకు కృతజ్ఞతలు' అని అన్నారు.
హీరో ప్రదీప్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలు ఒక ఎత్తయితే, ‘డ్యూడ్’ మరో ఎత్తు. ఇలాంటి మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడికి బిగ్ థ్యాంక్స్’. ఇది యూనివర్శల్ విజయం. ఈ చిత్రంతో తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో నాకు అభిమానులు వచ్చారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా స్టోరీపై కొందరికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, సినిమాను మూడునాలుగు సార్లు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది మళ్ళీమళ్ళీ చూడాలనిపించే మూవీ’ అన్నారు.
నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం వంద రోజుల విజయోత్సవ వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. సీనియర్ నటి రోహిణి మాట్లాడుతూ, ‘మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరులో ఇది నాకు మూడో సినిమా. అయితే, ఇప్పటివరకు తెలుగు సినిమాల సక్సెస్ మీట్‌లోనే పాల్గొన్నాను. చాలా రోజుల తర్వాత తమిళ సినిమా సక్సెస్ మీట్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అన్నారు.