Sriram Srikanth: డ్రగ్స్ కేసు.. జైలు నుంచి విడుదలైన హీరో
ABN , Publish Date - Jul 09 , 2025 | 09:47 AM
మాదక ద్ర వ్యాల వినియోగం కేసులో గత నెలలో అరెస్టయి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణలకు బెయిలు మంజూరైంది
మాదకద్రవ్యాల కేసులో నటులు శ్రీరామ్ శ్రీకాంత్ (Sriram Srikanth), కృష్ణ (krishna)లకు నిబంధనలతో కూడిన బెయిలు మంజూరైంది. మాదక ద్ర వ్యాల వినియోగం కేసులో గత నెలలో అరెస్టయి జైలులో ఉన్న శ్రీకాంత్, కృష్ణ తమకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు సోమవారం న్యాయమూర్తి నిర్మల్ కుమార్ విచారించారు.
ఈ కేసులో మొదటి నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నటుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేసిన సమయంలో శ్రీకాంత్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోలేదని శ్రీకాంత్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కృష్ణకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మాదకద్రవ్యాలు వినియో గించినట్లు నిరూపణ కాలేదని కృష్ణ తరఫు న్యాయవాది వివరించారు.
అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన AIADMK మాజీ నేత నిందితుల వాంగ్మూలం ఆధారంగా శ్రీకాంత్, కృష్ణలను అరెస్ట్ చేసినట్లు, వారికి బెయిలు మంజూరు చేయరాదని పోలీసుల తరపు న్యాయవాది కోరారు. వాదనల అనంతరం శ్రీకాంత్, కృష్ణ బెయిలుపై తీర్పును న్యాయమూర్తి, మంగళవారానికి వాయిదా వేశారు.
దీంతో.. మంగళవారం న్యాయమూర్తి వారికి బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10 వేల సొంత పూచీకత్తు, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరై సంతకం చేయాలని న్యాయమూర్తి నిబంధనలు విధించారు.