Adoor Gopalakrishnan: చెత్త సినిమాలకు.. అత్యున్నత పురస్కారాలా?
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:43 AM
ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అదూర్ గోపాలకృష్ణన్ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అదూర్ గోపాలకృష్ణన్ (Adoor Gopalakrishnan) జాతీయ చలనచిత్ర అవార్డుల (National Film Awards )ఎంపికపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొంతకాలంగా చెత్త సినిమాలకు అత్యున్నత పురస్కారాలు దక్కుతున్నాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నాసిరకం చిత్రాల ఎంపికకు జ్యూరీ అసమర్థతే ప్రధానకారణం అని ఆరోపిస్తూ, అర్హత కలిగిన జ్యూరీ ఉంటేనే సరైన చిత్రాలకు గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు. నాణ్యమైన సినిమాలను గుర్తించి, ప్రోత్సహించడమే జాతీయ అవార్డుల ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమనీ, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ నిర్ణేతల ప్రమాణాలు తక్కువగా ఉంటే, వారి గుర్తింపు కోసం నాసిరకం చిత్రాలనే పురస్కారాలకు ఎంపిక చేస్తారని ఎద్దేవా చేశారు.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జాతీయ పురస్కారాలను ఇవ్వడం మానుకుంటే మంచిదని గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో మలయాళ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ కి అవార్డులు రావడంపై గోపాలకృష్ణన్ కొన్నాళ్లుగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.