Rishab shetty: వాటర్ బాయ్.. టు నేషనల్ అవార్డ్ విన్నర్..
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:05 PM
రిషబ్‌శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. నటుడిగా ఎన్నో చిత్రాలు చేసినా, ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో సూపర్ సక్సెస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. నటుడిగా ఎన్నో చిత్రాలు చేసినా, ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’తో సూపర్ సక్సెస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్కసారిగా దేశం మొత్తం ఆయన గురించి మాట్లాడుకునేలా చేశారు.
ఒకప్పుడు క్లాప్ బాయ్‌గా, వాటర్ బాయ్‌గా పనిచేసిన ఆయన సినిమాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. కొన్ని సందర్భాల్లో సినిమాలే వద్దనుకున్నారు. కట్ చేస్తే గతేడాది ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అక్టోబర్ 2న ‘కాంతార - చాప్టర్ 1’తో (Kantara chapter 1) ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రిషబ్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
డిగ్రీ కోసం పంపితే
మాది కర్ణాటకలోని కెరాడి విలేజ్. నాన్న జ్యోతిష్కుడు. చిన్నప్పుడు మా ఇంట్లో మాత్రమే కరెంటు, టీవీ ఉండేవి. అప్పుడు దూరదర్శన్‌లో వచ్చే రాజ్‌కుమార్ సాంగ్స్ చూసి ఆయనలా హీరో కావాలనుకున్నా. హీరో ఉపేంద్ర మా ఏరియాకు చెందిన వ్యక్తే కావడంతో ఆయన స్ఫూర్తితో డైరెక్షన్ సైడ్ కూడా వెళ్లాలనే ఆశ కలిగింది. అయితే డిగ్రీ కోసం ఇంట్లో వాళ్లు బెంగళూరు పంపిస్తే, నేనేమో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. ఆ పనితో నాన్నకు కోపం వచ్చినా.. అక్కే డబ్బు పంపిస్తూ ఉండేది.
పేరు మార్చుకున్నాకే..
ఎన్నో కష్టనష్టాలు, అనేక ప్రయత్నాలు, వైఫల్యాలు, అవమానాల తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. అక్కడ కనీస గుర్తింపు రావడానికి నాలుగైదేళ్ల సమయం పట్టింది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. సినిమాల్లోకి వచ్చే ముందు ప్రత్యేకమైన పేరును ఎంచుకోవాలని అనుకున్నా. స్నేహితుల సూచనతో రిషబ్ శెట్టి అని మార్చుకున్నా. వాళ్లు చెప్పినట్లు.. పేరు మార్చుకున్నాకే నాకు సినిమాల్లో అదృష్టం కలిసొచ్చింది.
ఆయన దేవుడితో సమానం
ఎంత గొప్ప నటులకైనా.. చారిత్రక నేపథ్యమున్న పాత్రల్లో నటించడం ఓ సవాల్ అనే చెప్పాలి. అలాంటి చిత్రమే కాంతార. అలానే నేను నటిస్తున్న ‘జై హనుమాన్’, ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’, బంకించంద్ర ఛటర్జీ నవల ఆనంద్‌మఠ్ ఆధారంగా తీసే ‘1770’.. ఇవన్నీ అదే తరహావే.. కాంతార ప్రీక్వెల్ కోసం కత్తియుద్థం, గుర్రపు స్వారీతోపాటు యుద్థకళ అయిన కలరిపయట్టులో శిక్షణ తీసుకున్నా.
నటనలో కమల్ హాసన్ నాకు దేవుడితో సమానం. ‘యాంగ్రి యంగ్ మ్యాన్’లా అమితాబ్ తెరపైన కనిపించే తీరే కాంతారలో నా పాత్రకు స్ఫూర్తి. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ల అమ్మగారిది మా ఊరే కావడంతో మా మధ్య మంచి అనుబంధం ఉంది.
నాలో తండ్రిని చూసి మురిసిపోతుంది..
నేనూ, ప్రగతి ఓ సినిమా ఫంక్షన్‌లో అనుకోకుండా కలిశాం. మా ఇద్దరిదీ ఒకే ఊరనీ, ఇద్దరమూ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్ అనీ ఆ తర్వాతే తెలిసింది. అలా మొదలైన మా స్నేహం ప్రేమగా మారింది. అప్పటికి నేనింకా జీవితంలో సెటిల్ కాకపోవడంతో మా పెళ్లికి వాళ్లింట్లో ఒప్పుకోలేదు. చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఒక్కటయ్యాం. కాంతార సినిమాకు కాస్ట్యూమ్స్ అన్నీ తనే డిజైన్ చేసింది. ఆమె ఇచ్చే సపోర్ట్ మాటల్లో చెప్పలేను. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎంతో అండగా ఉంటుంది. ఎప్పటి నుంచో ప్రభ్వు పాఠశాలల్లో వసతులు కల్పించడంతోపాటు పిల్లలకు ఆర్థిక సాయం చేస్తున్నా. అలా వచ్చిన ఆలోచనే ‘రిషబ్ శెట్టి ఫౌండేషన్’. ఈ సేవా కార్యక్రమాలును నా భార్య ప్రగతే స్వయంగా చూసుకుంటుంది. పిల్లలతో గడుపుతుంటే అసలు సమయమే తెలియదు నాకు. అందుకే కాబోలు భార్య ఎప్పుడూ హీరో, డైరెక్టర్, రైటర్ కంటే తండ్రి పాత్రలతోనే నేను మరింత బాగా లీనమవుతానంటూ మురిసి పోతుంటుంది.
ఆ క్షణాలను మర్చిపోలేను..
సినీరంగంలో పని చేసే ప్రతి ఒక్కరికీ అవార్డు అనేది ఓ కల. అదే జాతీయ అవార్డు అంటే.. మాటలా? బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్‌గా, ముంబయిలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్‌గా పని చేసిన నేను.. ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. అదొక తీపి జ్ఞాపకం. లైఫ్ టైమ్ మెమరీ. ఓ టెక్నీషియన్‌కు ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది.