Mohanlal Birthday Special: మరోసారి జనం ముందుకు 'చోటా ముంబై'
ABN , Publish Date - May 05 , 2025 | 05:50 PM
మోహన్ లాల్ ఈ యేడాది మే 21న 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన నటించిన 'ఛోటా ముంబై' మూవీ రీ-రిలీజ్ కాబోతోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) ఈ యేడాది మే 21కి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. మూడు దశబ్దాలుగా మోహన్ లాల్ హీరోగా తన సత్తాను చాటుకుంటూనే ఉన్నాడు. ఈ యేడాది ఇప్పటికే మోహన్ లాల్ నటించిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan), 'తుడరుమ్' (Thudarum) చిత్రాలు విడుదలయ్యాయి. గత యేడాది మోహన్ లాల్ తొలిసారి మెగా ఫోన్ పట్టి 'బారోజ్' (Barroz) మూవీని త్రీడీలో తీశాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే... 'ఎల్ 2: ఎంపురాన్' మూవీ మాత్రం వివాదాలు తలెత్తినా విజయాన్ని విజయాన్ని సాధించింది. అలానే ఫ్యామిలీ డ్రామాగా విడుదలైన 'తుడరుమ్' సైతం చక్కని సక్సెస్ ను అందుకుంది.
విశేషం ఏమంటే ఈ మధ్య కాలంలో మోహన్ లాల్ నటించిన పలు చిత్రాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఈ యేడాది మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా కూడా ఓ సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. అదే 'చోటా ముంబై' (Chhota Mumbai). దర్శకుడు అన్వర్ రషీద్, మోహన్ లాల్ కాంబోలో వచ్చిన ఏకైక చిత్రం ఇది. బెన్నీ పి నయరంబలమ్ రచన చేసిన ఈ సినిమా 2007లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ యాక్షన్ కామెడీ సినిమాను ఇప్పటికీ కొన్ని చోట్ల స్పెషల్ స్క్రీనింగ్స్ వేస్తుంటారు అభిమానులు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే మే 21న మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా దీనిని రీ-రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని తాజా సాంకేతికతకు అనుగుణంగా డాల్బీ ఎట్మోస్ సౌండ్ సిస్టమ్ తో విడుదల చేస్తున్నామని నటుడు, నిర్మాత మణియన్ పిళ్ళై రాజు చెప్పారు. కామెడీ, యాక్షన్, డాన్స్, రొమాన్స్, ఫ్రెండ్ షిప్స్ ... ఇలా ఈ చిత్రంలో అనేక అంశాలకు దర్శకుడు పెద్ద పీట వేశాడు. మోహన్ లాల్ ఇందులో పోషించిన పాత్ర పేరు వాస్కో డి గామా. అయితే ఫ్రెండ్స్ అంతా అతన్ని తల అంటూ ఉంటారు. ఈ యేడాది మోహన్ లాల్ బర్త్ డే ఈ సినిమా రీ-రిలీజ్ తో కలర్ ఫుల్ గా జరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: CPI Narayana: బిగ్‌బాస్ షో.. ఓ ఖరీదైన వ్యభిచారం! బ్యాన్ చేయాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి