Chennai International Film Festival: నేటి నుంచి.. చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు! 12 చిత్రాలు ఎంపిక
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:08 PM
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 11–18 వరకు. 51 దేశాల 122 సినిమాలు, 12 తమిళ చిత్రాలు, 13 అవార్డులు. పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రదర్శనలు.
ఈ నెల 11వ తేదీ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Chennai International Film Festival ) ప్రారంభంకానుంది. ఈ నెల 18 వరకు జరిగే ఈ చిత్రోత్సవాలకు 12 తమిళ చిత్రాలను ఎంపిక చేశారు. ఈ వేడుకల ముగింపు కార్యక్రమంలో మొత్తం 13అవార్డులు ప్రదానం చేస్తారు. 51 దేశాలు, 27 భాషలకు చెందిన 122 చిత్రాలను ప్రదర్శించనున్నారు. తమిళం నుంచి ‘అలంగు’, ‘వేంబు’, ‘మాయకూత్తు’, ‘మరుదం’, ‘కాదల్ ఎన్బదు పొదు ఉడమై’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, ‘3 బీహెచ్‌కే’, ‘పిడిమణ్ తదితర చిత్రాలున్నాయి. ప్రారంభ చిత్రంగా ‘ఈగల్ ఆఫ్ ది రిపబ్లిక్’, ముగింపు చిత్రంగా ‘ఈఎన్-47’ ఎంపిక చేశారు.
అలాగే, 2026 ఆస్కార్ అవార్డు కోసం నామినేట్ అయిన 14 చిత్రాలు, 2025లో కేన్స్ అవార్డులు గెలుచుకున్న ఆరు చిత్రాలు, బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు పొందిన మూడు చిత్రాలు కూడా ఉన్నాయి. చెన్నై ఇంటర్నేషల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి జార్జియా, ఫిన్‌లాండ్, ఫిలిప్పీన్స్, జోర్డాన్, మియన్మార్, నేపాల్, మోంటెనెగ్రో, సెయింట్ హెలీనా దేశాలకు చెందిన చిత్రాలను ఎంపికచేశారు. పీవీఆర్ ఐనాక్స్ సత్యం, పీవీఆర్ ఐనాక్స్ సిటీ సెంటర్ థియేటర్లలో ఈ చిత్రాలను సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇండో సినీ అప్రీసియేషన్ ఫౌండేషన్, ఎన్‌ఎ్‌ఫడీసీ సంయుక్తంగా నిర్వహించనున్నారు.