Soubin Shahir: రూ.47 కోట్ల మోసం.. మలయాళ అగ్ర నటుడు అరెస్ట్
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:41 PM
2024లో విడుదలై భారీ విజయం సాధించిన మలయాళ చిత్రం ‘మంజున్నెల్ బాయ్స్’ నిర్మాతలు చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు
మలయాళ ఇండస్ట్రీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గత సంవత్సరం వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys). పలు అనువాద చిత్రాలు అండ్రాయిడ్ కుంజప్పన్, కుంబలంగీ పైట్స్, రోమాంచం వంటి వాటితో తెలుగు వారికి సైతం సుపరిచితమైన ప్రముఖ విలక్షణ నటుడు, నిర్మాత సౌబిన్ షాహిర్ (Soubin Shahir), మరో ఇద్దరిని చీటింగ్, ఫోర్జరీ కేసులపై కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సౌత్ ఇండియా వ్యాప్తంగా సంచలనంగా మారింది.
గత సంవత్సరం సౌబిన్ షాహిర్ కీలక పాత్రలో నటిస్తూ నిర్మాతగా బాబు షాహిర్ (Babu Shahir) మరియు షాన్ ఆంటోనీ (Shawn Antony) సహా నిర్మాతలుగా పరవ ఫిల్మ్స్ (Parava Films) బ్యానర్‌పై సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో మంజుమ్మల్ బాయ్స్ సినిమాను రూపొందించారు. గుణ కేవ్స్ సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం దేశాన్నే షేక్ చేసి సంచలన విజయం సాధించింది. అంతేగాక అనేక భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయగా అక్కడా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో దాదాపు రూ. 250 కోట్ల మేర వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.
అయితే.. సినిమా లాభాల పంపకాల విషయంలో కొంత కాలంగా నిర్మాతలు సౌబిన్ షాహిర్ అతని తండ్రి బాబు షాహిర్, షాన్ ఆంటోనీలు తమ వద్ద రూ.7 కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని, ఆపై సినిమాకు వచ్చిన లాభాల్లో ముందుగా అనుకున్న ప్రకారం 40 % వాటా ఇవ్వడం లేదని సుమారు రూ.47 కోట్ల మేర మోసం చేశారంటూ సిరాజ్ వలియతర హమీద్ అనే పెట్టుబడిదారు కోర్టును అశ్రయించాడు. దీంతో నిర్మాతలపై 2024 ఏప్రిల్ 23న చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదవగా ఏడాదిగా కేసు రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరడంతో పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సదరు నిర్మాతలు కేరళ కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు వారికి తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ FIR రద్దు పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో మారాడు స్టేషన్ పోలీసులు (Maradu police) సోమవారం వారిని విచారణకు పిలిచి అనంతరం అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియానే కాకుండా యావత్ ఫిలిం ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది.