Kamal Haasan: తమిళం జన్మనిచ్చింది.. తెలుగు స్టార్‌ను చేసింది
ABN , Publish Date - Nov 07 , 2025 | 03:54 PM
'వర్సటైల్ ఆర్టిస్ట్' అన్న పదానికి ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సూటబుల్ యాక్టర్ ఎవరంటే కమల్ హాసన్ అనే చెప్పాలి... నవంబర్ 7న 71 ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్ హాసన్ బాణీని గుర్తు చేసుకుందాం...
ఏడు పదులు దాటినా కమల్ హాసన్ (Kamal Haasan) లో ఈ నాటికీ వైవిధ్యంతో సాగాలన్న పట్టుదల చూస్తే ముచ్చటేస్తుంది. విలక్షణమైన పాత్రలకు సలక్షణమైన రూపం ఇవ్వడంలో తనకు తానే సాటి అని పలుమార్లు నిరూపించుకున్నారు కమల్ హాసన్. ఇండియాలో ప్రప్రథమంగా మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన ఘనత కమల్ హాసన్ సొంతం. ప్రయోగాలు చేయడంలోనూ తనదైన బాణీ పలికిస్తూ పయనిస్తున్నారు కమల్. అందుకే కమల్ సమకాలికులు సైతం ఆయనకు అభిమానులుగా మారిపోయారు. తాను కమల్ హాసన్ కు పెద్ద ఫ్యాన్ ను అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajini Kanth) పలు వేదికలపై చెప్పుకున్నారు. కమల్ - రజనీ మధ్య స్నేహబంధం కూడా అలాంటిదే. వారిద్దరి స్నేహానికి 50 ఏళ్ళు నిండాయి. వారిద్దరూ కలసి అనేక చిత్రాల్లో అలరించారు. అయితే దాదాపు నలభై ఏళ్ళుగా వారిద్దరూ ఒకే సీన్ లో కనిపించలేదు. త్వరలోనే రజనీకాంత్ - కమల్ హాసన్ కలసి నటించబోతున్నారు. సదరు చిత్రంతో పాటు రజనీ హీరోగా కమల్ హాసన్ మరో చిత్రాన్ని కూడా నిర్మిస్తూ ఉండడం విశేషంగా మారింది. ఈ చిత్రానికి సుందర్ సి. (Sundar C) దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో కమల్, రజనీ ఫ్యాన్స్ లో ఆనందం వెల్లివిరిస్తోంది.
కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ కె. బాలచందర్ (K. Balachandar) శిష్యులే. ఆ మాటకొస్తే కమల్ హాసన్ హీరోగా నటించిన 'అపూర్వ రాగంగళ్' సినిమాతోనే రజనీకాంత్ తెరకు పరిచయం కావడం విశేషం. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వారిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. థియేటర్స్ లో కమల్, రజనీ ఫ్యాన్స్ మధ్య గొడవలకు చెక్ పెట్టేందుకే వారిద్దరూ కలసి నటించక నలభై ఏళ్ళవుతోంది. కానీ, కమల్ హాసన్ వైవిధ్యం ప్రదర్శించిన ప్రతీసారి రజనీకాంత్ అభినందిస్తూ ఉండేవారు. రజనీ మాస్ మసాలా మూవీస్ తో సాగితే కమల్ ప్రయోగాలు చేస్తూ అలరించారు. ఈ ఇద్దరు తమిళ టాప్ స్టార్స్ తెలుగునాట కూడా అభిమానులను సంపాదించు కోవడం విశేషం. కమల్ నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీస్ 'మరోచరిత్ర, సాగరసంగమం, స్వాతిముత్యం' వంటి చిత్రాలు రికార్డ్ రన్ ను చూడడం గమనార్హం!
తెలుగువారి అభిమానాన్ని విశేషంగా చూరగొన్న కమల్ హాసన్ స్ట్రెయిట్ మూవీస్ లో నటించక చాలా ఏళ్ళయింది. అదుగో ఇదుగో అంటున్నారే కానీ, ఇప్పటిదాకా మళ్ళీ కమల్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ఒక్కటీ రాలేదు. అయినా సరే తెలుగునాట కమల్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వారిని మెప్పించడమే తన జీవితలక్ష్యం అని కమల్ సైతం పలు వేదికలపై సెలవిచ్చారు. తనను నటునిగా తీర్చిదిద్దింది బాలచందర్ అయితే, హీరోని చేసింది మళయాళ సీమ అని, స్టార్ ని చేసింది తెలుగువారేనని చెబుతూ ఉంటారు కమల్. మధ్యలో రాజకీయాల్లో అడుగుపెట్టి చేదు అనుభవాన్ని చవిచూశారు కమల్. ఏమైతేనేం ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న డి.యమ్.కె. పార్టీ అండతో రాజ్యసభ సభ్యుడయ్యారు కమల్. మరి రాబోయే సినిమాలతో కమల్ హాసన్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.
Also Read: Pongal Movies: రాజా సాబ్ సీన్ ఎలా ఉండబోతోంది...
Also Read: Sujeeth: సచిన్ తో సుజిత్.. ఫ్రేమ్ అదిరిపోయిందిగా