Ashok Kumar: సినిమా షూటింగ్‌లో ప్ర‌మాదం.. హీరోను పొడిచిన ఎద్దు

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:56 PM

‘వడ మంజువిరట్టు’ (VadaManjuvirattu) సినిమా చిత్రీకరణలో అపశ్రుతి చోటు చేసుకుంది.

Ashok Kumar:

‘వడ మంజువిరట్టు’ (VadaManjuvirattu) సినిమా చిత్రీకరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న జల్లికట్టు ఎద్దు... నియంత్రణ కోల్పోయి, హీరోను కొమ్ములతో పొడిచింది. దీంతో ఆయన పొట్ట భాగంలో గాయమైంది. ఈ ఘటనతో చిత్ర యూనిట్‌ సభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. ‘వడ మంజువిరట్టు’ అనేది తమిళ సంస్కృతిలోని పురాతన క్రీడల్లో ఒకటి. ఈ క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. నేల, ప్రజలు, సంస్కృతి, ప్రేమ, ఆప్యాయత, ధైర్యం ఇత్యాది అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Ashok Kumar:

ఇప్పటికే 25కు పైగా చిత్రాల్లో వివిధ పాత్ర‌లు చేసిన ‘మురుగ’ ఫేం అశోక్ (Ashok Kumar) వీరోచితమైన హీరో పాత్ర పోషిస్తున్నాడు. సంగిలి సీపీఏ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా దిండిగల్‌ జిల్లా అంజుకులిప్పట్టి గ్రామీణ ప్రాంతంలో కొన్ని సన్నివేశాలను జల్లికట్టు ఎద్దు, అశోక్‌పై చిత్రీకరిస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. దీనిపై హీరో అశోక్‌ స్పందిస్తూ, ‘చిన్న గాయమైనప్పటికీ కొమ్ము మరింత లోతుగా వెళ్ళి ఉంటే ఊపిరితిత్తులకు గాయం అయి ఉండేదని వైద్యులు చెప్పారన్నారు. ఇది అనుకోకుండా జరిగింది. మరుసటి రోజు నుంచే షూటింగ్‌లో పాల్గొన్నా అని అది శివుడి వాహనం. ఇపుడు నేను ఆ శివుని దయ వల్లే బయటపడ్డాను’ అని అశోక్‌ అన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 04:56 PM