Yash Toxic: యశ్ టాక్సిక్.. ఫీల్డ్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ! ఫస్ట్ లుక్ అదిరింది
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:23 PM
రాకింగ్ స్టార్ యశ్ (Yash) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాకింగ్ స్టార్ యశ్ (Yash) కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’(Toxic Movie) పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.
ఈ చిత్రంలో ‘ఎలిజబెత్’ అనే పాత్రలో హుమా ఖురేషి (Huma Qureshi) నటిస్తుండగా, ఆమె లుక్ సినిమాకు కొత్త డైమెన్షన్ ఇచ్చేలా ఉంది. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హుమా, టాక్సిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అభిమానుల్లో ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ మిస్టరీతో పాటు ఇంటెన్సిటీని స్పష్టంగా సూచిస్తున్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పరిశీలిస్తే.. హుమా ఖురేషి బ్లాక్ కలర్ డ్రెస్‌లో వింటేజ్ బ్లాక్ కార్ ముందు నిలుచుని కనిపిస్తుంది. వెనుకవైపు సమాధి రాళ్లు, రాతి దేవదూత విగ్రహం ఉండే శ్మశాన వాతావరణం కనిపించడంతో, ఈ పాత్ర చుట్టూ ఉన్న డార్క్ షేడ్స్ స్పష్టమవుతున్నాయి. పోస్టర్ మొత్తం ఒక గూఢమైన, భయానక వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, ఎలిజబెత్ పాత్రకు సరైన నటి ఎంపిక చేయడం చాలా సవాలుగా మారిందని తెలిపారు. ఈ క్యారెక్టర్‌కు బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటించే నటి అవసరమని, హుమా ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టిన క్షణమే ఆ ప్రత్యేకత అర్థమైందని చెప్పారు. హుమా సహజమైన నటన, ఇంటెన్సిటీ ఈ పాత్రకు ప్రాణం పోశాయని పేర్కొన్నారు. ఈ పాత్ర ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంటుందని అన్నారు.
ఇక హుమా ఖురేషి కూడా ఈ పాత్రపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ‘టాక్సిక్’ తనకు ఓ ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. మొదటిసారి గీతూ మోహన్‌దాస్‌ను కలిసినప్పుడు ఆమె విజన్ చూసి ఆశ్చర్యపోయానని, ఈ సినిమా ద్వారా ఎవరూ ఊహించని ప్రయోగాన్ని ప్రేక్షకులకు చూపించ బోతున్నామని చెప్పారు. ఎలిజబెత్ పాత్ర తనకు ఓ బహుమతి లాంటిదనన్నారు.
యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రూపొందించగా, గీతూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఒకేసారి ఇంగ్లీష్, కన్నడ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనుండటంతో, ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడింది.
సాంకేతికంగా కూడా ‘టాక్సిక్’ అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీ.పీ. అబీద్ చేపట్టారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్క్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు విజేత అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.