Bison: కబడ్డీ రక్తంలో కలిసిపోయి ఉంటుంది
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:25 AM
బైసన్’ (Bison movie) చిత్ర నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన ఆ చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari selvaraj) కష్టానికి ఈ సినిమా ఘన విజయం సాధించాలని యువ హీరో ధృవ్ ఆకాంక్షించారు
‘బైసన్’ (Bison movie) చిత్ర నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన ఆ చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari selvaraj) కష్టానికి ఈ సినిమా ఘన విజయం సాధించాలని యువ హీరో ధృవ్ ఆకాంక్షించారు. ధృవ్ (Dhruv) - అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) , రజీషా విజయన్ జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైసన్’. ఇతర పాత్రల్లో అమీర్, పశుపతి, లాల్ తదితరులు నటించారు. కబడ్డీ నేపథ్యంగా పా.రంజిత్ నీలమ్ స్టూడియో, అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం రాత్రి నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో ధృవ్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎల్లవేళలా నా తల్లిని సంతోష పెట్టేందుకు కోరుకుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తారు. ‘బైసన్’ సినిమా కోసం దర్శకుడు మారి సెల్వరాజ్ ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగినట్టుగా ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు అమీర్ మాట్లాడుతూ, ‘ఇందులో వేలుసామి అనే పాత్రలో నటించాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్ర క్రెడిట్ దర్శకుడు మారికే చెందుతుంది. ధృవ్ జాతీయ స్థాయిలో కూడా కబడ్డీ ఆడగలడు. ఈ సినిమా కోసం అసిస్టెంట్లు చాలా కష్టపడి పనిచేశారు. వారితోపాటు దర్శకుడు మారి సెల్వరాజ్‌కు నా అభినందనలు’ అన్నారు.
దర్శకుడు మారి సెల్వరాజ్ మాట్లాడుతూ, ‘కొన్ని ప్రాంతాల్లో కబడ్డీ ఆట రక్తంలో కలిసిపోయివుంది. ఈ సినిమా కోసం ఎంపిక చేసిన ఆటగాళ్ళు నిజమైన క్రీడాకారులు. ప్రో కబడ్డీ ప్రభంజన్ చాలాబాగా నటించారు. ఈ సినిమా కోసం ధృవ్ రెండేళ్ళపాటు శ్రమించారు. ఆయనకు ఈ సినిమా మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, లాల్, పశుపతి తదితరులు పాల్గొన్నారు.