Samantha - Raj Nidimoru: సమంత పెళ్లి.. ఇంత కథ ఉందా
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:23 AM
హీరోయిన్ సమంత (Samantha), దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఎట్టకేలకు భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
హీరోయిన్ సమంత (Samantha), దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఎట్టకేలకు భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవ ఆలయంలో వీరి వివాహం సోమవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత సమంత, రాజ్ నిడిమోరు తమ ఇన్‌స్టా ఖాతాల్లో పెళ్ళి ఫోటోలను షేర్ చేసి అధికారికంగా వెల్లడించారు. ఈ పెళ్ళిలో సమంత ఎర్రరంగు చీర, జాకెట్ ధరించగా, రాజ్ నిడిమోరు క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తాను ధరించారు. నాగచైతన్యతో సమంత వివాహం ఎంత ఆర్భాటంగా జరిగిందో, దానికి భిన్నంగా రాజ్‌తో ఆమె పెళ్లి సింపుల్‌గా జరగడం గమనార్హం. కాగా, హిందీ బుల్లితెర జంట వరుణ్ జైన్, గియో మానిక్ ది కూడా భూతశుద్ధి వివాహమే. సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లి భూతశుద్ధి పద్ధతిలో జరిగిందని ఈషా ఫౌండేషన్ ప్రకటించడంతో ఇప్పుడు ఆ వివాహ పద్ధతి గురించి అన్వేషణ మొదలైంది.
భూత శుద్ధి వివాహం అంటే...
భూత శుద్ధి వివాహం అనేది యోగా సంప్రదాయ విధానంలో వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న అత్యంత పవిత్రమైన వివాహ పద్ధతి. ఇందులో పేరుకు తగ్గట్టుగానే ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరిచేందుకు రూపొందించిన విశిష్టమైన ప్రక్రియ. లింగ భైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధూవరుల దేహాన్నిశుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.
సాధారణంగా హిందూ జంటలకు చేసే సంప్రదాయ మంత్రోచ్ఛారణలతో పాటూ వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి స్థాయులను సమన్యయం చేసే యోగిక క్రతువులతో ఈ వివాహం జరుపుతారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేవారు సమంత. ఆ ప్రదేశంతో ఉన్న ప్రత్యేక అనుబంధమే ఆమె ఈ వివాహ ప్రక్రియను ఎన్నుకోవడానికి కారణమని అంటున్నారు.

ఎవరీ.. రాజ్ నిడిమోరు?
'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న రాజ్ నిడిమోరు స్వస్థలం తిరుపతి. ఆయన పూర్తి పేరు రాజేశ్. అమెరికాలో కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. సినిమాలపై ఆసక్తితో తన మిత్రుడు డీకేతో కలసి పని చేయడం మొదలుపెట్టారు. 'రాజ్ అండ్ డీకే'గా వీరిద్దరూ పేరు తెచ్చుకున్నారు. ఈ దర్శక ద్వయం తెరకెక్కించిన తొలి సినిమా 'ఫ్లవర్స్'. ఆ తర్వాత 99', సందీప్ కిషన్‌తో డీ ఫర్ దోపిడి, సైఫ్ అలీఖాన్‌తో 'గో గోవా గాన్', 'హ్యాపీ ఎండింగ్' చిత్రాలు చేశారు. 2019లో వీరు రూపొందించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ తొలి సీజన్ ఈ దర్శకద్వయానికి మంచి బ్రేక్ నిచ్చింది.
పరిచయం నుంచి పెళ్లి వరకూ...
సమంత, రాజ్ నిడిమోరుకు మొదటిసారి ఓ పెర్ఫ్యూమ్ యాడ్లో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. సినిమాల పరంగా వీరు తొలిసారి 'ఫ్యామిలీ మ్యాన్ 2' కలసి పనిచేశారు. 2021లో ఇది విడుదలవ్వగా, ఆ తర్వాత 'సిటాడెల్: హనీ.. బన్నీ'లో కలసి మరోసారి రాజ్ దర్శకత్వంలో సమంత నటించారు. ఆమె సొంతంగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' సంస్థను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అందులో రాజ్ నిడిమోరు కూడా ఓ భాగస్వామి. ఆమె నిర్మించిన తొలి చిత్రం 'శుభం'కు ఆయన క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న కొంతకాలానికి సమంత, రాజ్ నిడిమోరు కలసి పబ్లిక్ లో కనిపించడం మొదలుపెట్టారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆ ఊహాగానాలను మరింత పెంచుతూ ఇద్దరూ కలసి 'శుభం' ప్రమోషన్లలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి విహార యాత్రలకు, సినిమాలకు వెళ్లడం.. పండగలు సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా అప్పుడు తీసుకున్న ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుండడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.'

ఇద్దరికీ ద్వితీయ వివాహమే..
దర్శకుడు రాజ్ నిడిమోరు 2015లో రచయిత శ్యామాలిని పెళ్లి చేసుకున్నారు. 'ఓంకార', 'రంగ్ దే బసంతి' చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారామె. ఏడేళ్ల వైవాహిక జీవితం గడిపాక 2022లో ఈ జంట విడాకులు తీసుకుంది. మరోవైపు సమంతకు కూడా ఇది రెండో వివాహమే. 2010లో విడుదలైన 'ఏ మాయ చేశావే'లో అక్కినేని నాగచైతన్యతో కలసి నటించారు సమంత. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అనుకోని కారణాల వల్ల 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2024లో శోభిత ధూళిపాలను నాగచైతన్య పెళ్ళాడిన సంగతి తెలిసిందే.
రాజ్ మాజీ భార్య.. పోస్టు వైరల్
రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 'తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు' అని పేర్కొన్నారు. ఆమె వీరిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటి పూనమ్ కౌర్ 'నీకంటూ సొంత జీవితం సృష్టించుకోవడానికి ఓ పచ్చటి కాపురాన్ని కూల్చావు' అని పేర్కొన్నారు.