Ashika Ranganath: నాలుగేళ్ళ క్రితం సినిమా ఇప్పుడు...
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:55 PM
ఆషికా రంగనాథ్ నటించిన 'గత వైభవ' ఎట్టకేలకు జనం ముందుకు వస్తోంది. దాదాపు నాలుగేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.
అక్కినేని నాగార్జున (Nagarjuna) 'నా సామిరంగ' (Naa Saamiranga) చిత్రంలో నటించడానికి ముందు 'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శాండిల్ వుడ్ భామ ఆషికా రంగనాథ్ (Aashika Ranganadh). ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) 'విశ్వంభర'లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఆషికా తమిళంలో 'సర్దార్ -2'లో చేస్తోంది. అయితే కన్నడలో ఆమె నటించిన 'గత వైభవ' (Gatha Vaibhava) చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యి నవంబర్ 14న జనం ముందుకు రాబోతోంది. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ఈ ఫాంటసీ డ్రామాను సింపుల్ సుని తెరకెక్కించాడు. దాదాపు 70 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేశారు. క్రిస్టోఫర్ కొలంబస్ ఓడ ప్రతిరూపమైన పోర్చుగల్ లోని శాంటా మారియా డి కొలంబో లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 14వ శతాబ్దంలో వాస్కో డా గామా కు సంబంధించిన చరిత్రనూ ఈ ఫాంటసీ మూవీలో చూపించారు. ఈ సన్నివేశాలకు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. మూవీకి హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. విస్తారమైన కథ, దాన్ని తెరకెక్కించడంలో ఎదురైన అవాంతరాల కారణంగా ఈ సినిమా నిర్మాణం నాలుగైదేళ్ళ పాటు సాగింది. సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు.
'గత వైభవ' సినిమా గురించి దర్శకుడు సింపుల్ సుని మాట్లాడుతూ, '14వ శతాబ్దానికి, ప్రస్తుతానికి లింక్ చేస్తూ ఈ కథను రాసుకున్నాం. ఈ ఫాంటసీ డ్రామాలో దేవలోకాన్ని కూడా చూపించబోతున్నాం. దానికి సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. రూపకల్పనకే మాకు చాలా సమయం పట్టింది. ఈ సినిమాతో దుష్యంత్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీని నవంబర్ 14న కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం' అని అన్నారు. 'గత వైభవ' చిత్రాన్ని దీపక్ తిమ్మప్ప నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సింపుల్ సుని కథ, కథనం, సంభాషణలు, పాటలు అందించగా, విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ మూవీకి జుడా సాంధీ సంగీతం అందించారు. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను తెలియచేస్తూ మూవీ టీజర్ ను విడుదల చేశారు.
Also Read: Tollywood: తెలుగు చిత్రసీమలో విషాదం
Also Read: Kantara Chapter 1: తెలుగోళ్ల ఆగ్రహం.. ట్రెండ్‌లో ‘బాయ్‌కాట్ కాంతార చాప్టర్ 1’