Lockdown: లాక్ డౌన్ విషయంలో చేతులెత్తేసి లైకా...

ABN , Publish Date - Dec 11 , 2025 | 03:10 PM

డిసెంబర్ 5 నుండి 12కు వాయిదా పడిన అనుపమా పరమేశ్వరన్ 'లాక్ డౌన్' మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యింది. అనివార్య కారణంగా ఈ సినిమాను 12వ తేదీ రిలీజ్ చేయడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది.

Lock Down Movie

అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన పలు చిత్రాలు ఈ యేడాది విడుదలయ్యాయి. విశేషం ఏమంటే... ఈ సినిమాలన్నింటిలోనూ అనుపమా భిన్నమైన పాత్రాలే చేసింది. అయితే అదే సమయంలో ఈ సినిమాలు జనం ముందుకు రావడానికి ముందు పలు నాటకీయ పరిణామాలూ చోటుచేసుకున్నాయి. ఈ యేడాది ఆమె తొలి చిత్రంగా 'డ్రాగన్' (Dragon) విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గానూ మెప్పించింది. ఆ తర్వాత జనం ముందుకు రావాల్సి 'పరదా' (Paradha) సినిమా సైతం పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఆగస్ట్ లో విడుదలైంది. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీపై అనుపమా పరమేశ్వరన్ చాలానే ఆశలు పెట్టుకుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ, ప్రమోషన్స్ లోనూ పలు మార్లు భావోద్వేగానికీ గురైంది. ఇంత జరిగినా... ఆ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇక అనుపమా పరమేశ్వరన్ నటించిన మరో సినిమా 'కిష్కిందపురి' (Kishkindhapuri) ఫర్వాలేదనిపించింది.


మలయాళ అనువాద చిత్రం 'జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (JSK: Janaki V v/s State of Kerala) సెన్సార్ సమస్యలను ఎదుర్కొని విడుదలైనా... బాక్సాఫీస్ బరిలో ఏ రకమైన ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన మరో మలయాళ చిత్రం 'ది పెట్ డిటెక్టివ్' (The Pet Detective) ఓ మాదిరిగా ప్రేక్షకాదరణ పొందింది. అలానే తమిళ చిత్రం 'బైసన్' (Bison) ఫర్వాలేదనిపించింది. తెలుగులోనూ ఇది డబ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆమె నటించిన తమిళ చిత్రం 'లాక్ డౌన్' (Lockdown) ను డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్టు లైకా ప్రొడక్షన్స్ (LYCA Productions) సంస్థ ప్రకటించింది. విశేషం ఏమంటే... ఈ సినిమాను నవంబర్ 23న గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియా లో ప్రదర్శించారు. అయితే... లైకా సంస్థ చివరి నిమిషంలో ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల చేయట్లేదని ప్రకటించింది. చెన్నైలో ఆ సమయంలో వర్షాలు కారణంగా దీనిని వాయిదా వేసినట్టు చెప్పింది. దాంతో ఈ మూవీ డిసెంబర్ 12కు వాయిదా పడింది. చిత్రం ఏమంటే... ఇప్పుడు కూడా ఈ సినిమా రావట్లేదు. ఈ విషయాన్ని లైకా సంస్థే స్వయంగా మరోసారి ప్రకటించింది. లైకా ప్రొడక్షన్ హౌస్ పైకి రకరకాల కారణాలు చెబుతున్న... ఆ సంస్థ కూడా ఆర్థికంగా చిక్కుల్లో ఉందని, అందువల్లే సినిమాను రిలీజ్ చేయలేకపోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి 'లాక్ డౌన్' మూవీ ఎప్పుడు వెలుగు చూస్తుందో చూడాలి.

Updated Date - Dec 11 , 2025 | 03:24 PM