Ajith Kumar: అజిత్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి?

ABN , Publish Date - May 17 , 2025 | 07:25 PM

తల అజిత్‌ ఓ వైపు సినిమాలు, మరోవైపు బైక్‌ రేస్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.  


తల అజిత్‌ ఓ వైపు సినిమాలు, మరోవైపు బైక్‌ రేస్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లి’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని అలరించింది.  ఇటీవల పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు అజిత్‌. జనవరిలో జరిగిన 24హెచ్‌ దుబాయ్‌ కారు రేసింగ్‌లో అజిత్‌ పాల్గొన్నారు. ఆ పోటీల్లో అజిత్‌ టీమ్‌ మూడో స్థానాన్ని  సొంతం చేసుకుంది. ఇటలీలో జరిగిన 12హెచ్‌ రేస్‌లోనూ మూడో స్థ్థానం దక్కించుకుంది. బెల్జియంలో నిర్వహించిన స్పా- ఫ్రాన్‌కోర్‌ ఛాంప్స్‌ సర్క్యూట్‌లో ఆయన టీమ్‌ ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు. అంతేకాకుండా, రేసింగ్‌లో పాల్గొనడం పైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘‘రేసింగ్‌ అంటే నాకెంతో ఇష్టం. రేసింగ్‌కు ఫిట్‌నెస్‌ అవసరం. చాలా రోజుల తర్వాత కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలని అర్థమైంది. స్విమ్మింగ్‌, సైక్లింగ్‌తోపాటు ఇతర వర్కౌట్లు, డైట్‌ చేశా. గత ఎనిమిది నెలల కాలంలో సుమారు 42 కిలోల బరువు తగ్గా. రేసింగ్‌ - సినిమా ఒకే సమయంలో ఉంటే ఆ రెండింటికీ సరైన న్యాయం చేయలేకపోతున్నా. దాని వల్ల ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. రేసింగ్‌ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. నిజం చెప్పాలంటే, నా సినిమాల్లో స్టంట్స్‌ నేనే చేస్తా. దీనివల్ల నాకు ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని, యాక్షన్‌ సినిమాలు వదిలేయలేను కదా. అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కు దూరం కాలేను. నా దృష్టిలో ఈ రెండూ ఒకే లాంటివి’’ అని అజిత్‌ అన్నారు. తదుపరి ప్రాజెక్ట్‌ నవంబర్‌లో మొదలుకానుందని వచ్చే ఏడాది వేసవికి ఆ సినిమా విడుదల కానుందని తెలిపారు.

Updated Date - May 17 , 2025 | 07:56 PM