Ajith Kumar: బలవంతంగా సినిమాను వదిలేస్తానేమో
ABN, Publish Date - May 02 , 2025 | 03:55 PM
తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్లు అజిత్ (Ajith kumar) ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అలాగే సినిమా నుంచి తాను ఎప్పుడైనా బలవంతంగా బయటకు రావచ్చని తాజాగా ఆయన అన్నారు.
తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినట్లు అజిత్ (Ajith kumar) ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అలాగే సినిమా నుంచి తాను ఎప్పుడైనా బలవంతంగా బయటకు రావచ్చని తాజాగా ఆయన అన్నారు. తాజాగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న ఆయన నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘మనం ఒకటి అనుకుంటే విధి మనల్ని మరొకటి చేస్తుంది. నేను స్టార్‌గా ఎదగాలని ఇండస్ర్టీకి రాలేదు. నా అప్పులు తీర్చడానికి నటుడిని అయ్యాను. నా మొదటి సినిమా చూస్తే అందులో నా నటన భయంకరంగా ఉంటుంది. తమిళంలో కూడా నా సినిమాలకు మరొకరితో డబ్బింగ్ చెప్పించేవారు. నేను మాట్లాడే యాస బాగా లేదని ఎంతోమంది విమర్శించారు. ఇప్పటికీ కొందరు మిమిక్రీ చేసేటప్పుడు తొలినాళ్లలో నా మాటతీరును చేస్తారు. కానీ, నేను ఆ విమర్శలకు కుంగిపోలేదు. సవాలుగా తీసుకున్నాను. నిజాయతీగా పని చేశాను.
నేను నటన నుంచి ఎప్పుడు వైదొలుగుతానో ఎవరికీ తెలియదు. బలవంతంగానైనా సినిమాను విడిచిపెట్టే సమయం రావొచ్చు. నేను ఏ విషయాన్ని తేలికగా తీసుకోకూడదనుకుంటున్నా. భవిష్యత్తులో ప్రేక్షకులు నా నటన గురించి ఫిర్యాదు చేస్తారేమో తెలియదు కదా! నన్ను వారంతా ఆదరిస్తున్నప్పుడే వైదొలుగుతానేమో.? జీవితం చాలా విలువైనది. నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. అలాగే నా స్నేహితులు, బంధువుల్లో చాలామంది జీవితంతో పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారు. వారంతా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు జీవితం విలువ అర్థమవుతుంది. నేను నా లైఫ్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాను. సమయాన్ని వృథా చేయను’’ అని అన్నారు.