Ajith Kumar: దానికి విజయ్ ఒక్కడే బాధ్యుడు కాదు..
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:20 AM
తమిళ అగ్ర హీరో అజిత్ మీడియాకు, సినిమా ప్రమోషన్స్‌కు కాస్త దూరంగా ఉంటారు. సినిమాలతో బిజీగా ఉండే ఆయన తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లో మరింత యాక్టివ్‌గా ఉంటారు. కాస్త గ్యాప్ దొరికితే మాత్రం తన స్పోర్స్ట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటారు
తమిళ అగ్ర హీరో అజిత్ (Ajith) మీడియాకు, సినిమా ప్రమోషన్స్‌కు కాస్త దూరంగా ఉంటారు. సినిమాలతో బిజీగా ఉండే ఆయన తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లో మరింత యాక్టివ్‌గా ఉంటారు. కాస్త గ్యాప్ దొరికితే మాత్రం తన స్పోర్స్ట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 2021 తమిళనాడు ఎన్నికల ( Election Controversy) సందర్భంలో తనపై వచ్చిన నెగటివ్ వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. ఆ వార్తలు చూసి షాక్ అయినట్లు చెప్పారు. అలాగే తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. అలాగే తమిళనాడులో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపైనా కూడా ఆయన స్పందించారు.
ఫ్యాన్‌పై కోపడ్డానని నెగెటివ్ ప్రచారం..
తమిళనాడులో గత ఎన్నికల్లో తనపై వచ్చిన ఓ వార్త గురించి ఆయన స్పందించారు. ‘ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ అభిమానిపై నేను ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో ఒక వార్త వైరల్ అయింది. ఓటు వేయడానికి షాలినితో కలిసి వెళ్లాను. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలందరినీ క్యూలో ఉన్న ఓ వ్యక్తి ఫొటోలు తీస్తున్నాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఫోన్‌లు ఉపయోగించడానికి వీల్లేదు అని బోర్డులు పెట్టారు. అక్కడి సిబ్బంది చెబుతున్నా కూడా అతను అవేవీ లెక్క చేయకుండా ఫొటోలు తీస్తూనే ఉన్నారు. చెప్పినా వినకపోవడంతో అతడి ఫోన్ తీసుకొని సిబ్బందికి ఇచ్చాను. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అందరూ నేను ఫ్యాన్‌పై కోపడ్డానని నెగెటివ్ వార్తలు రాశారు. ఆ వార్తలు చూసి షాకయ్యాను’ అని వివరణ ఇచ్చారు.
ఆ చర్యల వల్ల జీవితాలు ఇబ్బందుల్లో..
‘నేను సైన్ చేసిన ప్రతి సినిమాను మొదటి సినిమాగానే భావించి పనిచేస్తాను. నేను అందుకున్న విజయాలెన్నో ఉన్నాయి. కానీ వాటి గురించి ఆలోచించను. ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్లిపోతా. మొదటి సినిమా కోసం ఆ రోజు దర్శక నిర్మాతలు నన్ను 100 రోజుల కాల్‌షీట్ అడిగారు.. నేను వాళ్లకు 33 సంవత్సరాల నుంచి డేట్స్ ఇస్తూనే ఉన్నాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. దీనంతటికి నా భార్య సపోర్టే కారణం. ఆమె వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఇక నా పిల్లలు వాళ్ల స్కూల్ దగ్గరికి రావాలని అప్పుడప్పుడూ కోరతారు. కానీ, ఒక్కరోజు కూడా వాళ్లను డ్రాప్ చేయడానికి వెళ్లలేదు. ఎందుకంటే నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే కనీసం ఓ 50 మంది బైక్‌లపై నన్ను ఫాలో అవుతారు. ఫొటో కావాలని అడుగుతారు. మితిమీరిన అభిమానం, వారి చర్యల వల్ల కొన్ని సందర్భాల్లో అందరి జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి. కారులో నుంచి ఫొటోలు ఇచ్చినప్పుడు నా చేతికి గాయాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి’ అని అజిత్ అన్నారు.
పరిశ్రమకు చాలా చెడ్డ పేరు
‘జీవితంలో ఏ మనిషి ఎక్కువ కాదు.. తక్కువ కాదు. ఒకరిని తక్కువ చేయడం, ఒకరి గురించి ఎక్కువ మాట్లాడటం నాకు చేత కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాద సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కరూర్ తొక్కిసలాటకు విజయ్ ఒక్కడే కారణం కాదు.. దీనికి మనందరం కూడా బాధ్యులమే. ముఖ్యంగా మీడియా వీటిపై అవగాహన కలిగించాలి. ఇలాంటి పరిస్థితులు సినీతారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం లక్షల మంది వెళ్తారు. వారంతా సురక్షితంగా వస్తారు. కానీ, థియేటర్‌లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? దీనివల్ల సినిమా పరిశ్రమకు చాలా చెడ్డ పేరు వస్తోంది’ అని అన్నారు.