Shankar: గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్.. వేల్పరితో శంకర్ కంబ్యాక్ అయ్యేనా?
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:19 AM
ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాకు శంకర్ (Shankar) ఒక పర్యాయపదం. ఆయన పేరు చెబితేనే భారీ బడ్జెట్, విజువల్ వండర్, సామాజిక సందేశం గుర్తుకొచ్చేవి.
ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాకు శంకర్ (Shankar) ఒక పర్యాయపదం. ఆయన పేరు చెబితేనే భారీ బడ్జెట్, విజువల్ వండర్, సామాజిక సందేశం గుర్తుకొచ్చేవి. జెంటిల్‌మెన్ నుంచి రోబో వరకు.. వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నమోదు అయినవే. ఆయన సినిమాల్లో నటించడానికి అగ్ర హీరోలంతా క్యూ కట్టేవారు. సినిమా ఎంత బడ్జెట్‌తో తెరకెక్కినా, నిర్మాతలకు మాత్రం లాభాల పంట పండించేవారు. కానీ, గత కొన్నేళ్లుగా సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడాయన ప్రాజెక్టులంటే హీరోలు, నిర్మాతలు ఇద్దరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఈ భయానికి ప్రధాన కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు భారీ చిత్రాల ఫలితాలు.. కమల్ హాసన్ తో వచ్చిన ఇండియన్ 2 (Indian 2), రామ్ చరణ్ (Ram Charan) తో వచ్చిన గేమ్ ఛేంజర్ (Game Changer). అత్యంత భారీ బడ్జెట్‌తో, అపారమైన అంచనాలతో విడుదలైన ఈ చిత్రాలు.. ఆ అంచనాలకు తగినట్లుగా వసూళ్లు సాధించలేకపోయాయి.
ముఖ్యంగా, ఈ సినిమాల బడ్జెట్‌లు ఆకాశాన్ని తాకడంతో, విడుదలైన తర్వాత వచ్చిన రాబడి నిర్మాతల పెట్టుబడిని అందుకోలేకపోయింది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాతలు, పంపిణీదారులకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఒకప్పుడు శంకర్ లైఫ్ ఇచ్చిన హీరోలు, ఆయనకు లైఫ్ నిచ్చిన హీరోలు సైతం... ఈ ఆర్థిక నష్టాల కారణంగా ఆయనతో మరో సినిమా చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈ చేదు అనుభవం శంకర్‌కు ఒక 'స్ట్రోక్' లా తగిలింది. ఈ నష్టాలు, పరాజయాలు శంకర్ గారి దృష్టిలోంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వేల్పరి (Valpari) ని మాత్రం దూరం చేయలేకపోయాయి. తమిళ వీరుడు వేల్పరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రం శంకర్ చిరకాల కోరిక. శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గత సినిమాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి బడ్జెట్, షూటింగ్ విషయంలో ఏమాత్రం లోపం లేకుండా, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నారట. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని, ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను చాలా సైలెంట్‌గా మొదలుపెట్టారట.
ప్రస్తుతానికి 'వేల్పరి'కి సంబంధించిన కీలక విషయాలు గోప్యంగా ఉన్నా, ఇండస్ట్రీలో మాత్రం కొన్ని విషయాలపై ఆసక్తి నెలకొంది. గత చిత్రాల నష్టాల నేపథ్యంలో, ఇంత భారీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసి, శంకర్ విజన్‌ను నమ్మి పెట్టుబడి పెట్టబోయే నిర్మాణ సంస్థ ఏది. చారిత్రక వేల్పరి పాత్రలో నటించబోయే అగ్ర హీరో ఎవరు? అనే విషయాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఈ వివరాలు బయటకు రానప్పటికీ, శంకర్ తీసుకుంటున్న ఈ గోప్యత చూస్తుంటే... ఈసారి అనవసర ప్రచారాలకు అవకాశం ఇవ్వకుండా, పూర్తి ప్లానింగ్‌తోనే ఈ మెగా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని ఆయన దృఢంగా ఉన్నట్లు అర్థమవుతోంది. 'వేల్పరి' ఒక చారిత్రక యుద్ధ చిత్రం. ఈ జానర్‌ను డీల్ చేయడంలో శంకర్ విజన్, గ్రాండియర్‌కు తిరుగులేదు. ఒకవేళ ఆయన ఈసారి బడ్జెట్ మరియు సమయం విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించి, ఈ కథను విజయవంతంగా తెరకెక్కించగలిగితే... 'వేల్పరి' అనేది ఆయనకు కంబ్యాక్ ఇవ్వడమే కాదు, గత చేదు అనుభవాలన్నీ మర్చిపోయేలా చేసి, ఇండియన్ సినిమా చరిత్రలో మరో చారిత్రక అధ్యాయంగా నిలిచిపోవడం ఖాయం.