Vishal Vs Lyca: విశాల్ నుంచి.. ఆ డబ్బు ఇప్పించండి! కోర్టుకెక్కిన లైకా.. సినిమా నుంచి తప్పుకున్న హీరో
ABN , Publish Date - Oct 17 , 2025 | 07:59 AM
రూ.21.29 కోట్ల రుణం కేసులో హీరో విశాల్‌పై లైకా ప్రొడక్షన్ హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు విశాల్‌కు ఆదేశించింది.
తమ సంస్థకు చెల్లించాల్సిన రూ.21.29 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ (Lyca Productions) దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని హీరో విశాల్ (Vishal) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆదేశాలు జారీచేసింది.
నటుడు విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ప్రొడక్షన్ కోసం గోపురం ఫిలిమ్స్ (Gopuram Films) నుంచి రూ.21.29 కోట్ల రుణంగా తీసుకున్నారు. ఈ రుణాన్ని తాము చెల్లిస్తామని లైకా ప్రొడక్షన్ ముందుకు వచ్చి ఆ మొత్తాన్ని గోపురం ఫిలిమ్స్‌కు చెల్లించింది. అదే సమయంలో విశాల్ నటించే అన్ని చిత్రాల పంపిణీ హక్కులు లైకాకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
కానీ, ఈ ఒప్పందాన్ని విశాల్ పాటించలేదు. దీంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రూ.21.29 కోట్ల రుణానికి 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో వీటిని అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని లైకా సంస్థ మళ్ళీ కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది.
అయితే.. విశాల్ ప్రస్తుతం ‘మగుడం’ (Magudam)అనే చిత్రంలో నటిస్తున్నారని, ఆ చిత్రానికి తీసుకునే రెమ్యునేషన్‌ను హైకోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని లైకా తరపున హాజరైన న్యాయవాది కోరారు. ఈ వాదనలు ఆలకించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని విశాల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలాఉంటే దర్శకుడితో వచ్చిన విభేదాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం విశాల్ ఈ సినిమా నుంచి మధ్యంతరంగా తప్పుకోవడం గమనార్హం.