Tamil Movies: రిలీజులు 275.. విజయాలు 10 ! తమిళ సినిమాకు.. కలిసిరాని 2025
ABN , Publish Date - Dec 31 , 2025 | 08:05 AM
తమిళ చిత్రపరిశ్రమకు 2025 సంవత్సరం కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. విడుదలైన చిత్రాలు వందల సంఖ్యలో ఉండగా, విజయం సాధించినవి మాత్రం వేళ్ళపై లెక్కించేలా ఉన్నాయి.
తమిళ చిత్రపరిశ్రమలో 2025 సంవత్సరం కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. విడుదలైన చిత్రాలు వందల సంఖ్యలో ఉండగా, విజయం సాధించినవి మాత్రం వేళ్ళపై లెక్కించేలా ఉన్నాయి. అయితే, గత యేడాదితో పోల్చితే ఈ యేడాది అధిక చిత్రాలు విడుదల కావడం గమనార్హం. అదేవిధంగా భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ మిగిల్చాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. అలాగే, పలువురు యువ దర్శకులు తాము దర్శకత్వం వహించిన తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అగ్ర హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించే సువర్ణావకాశాన్ని సైతం దక్కించుకున్నారు.
ఇక.. ఈ యేడాది దాదాపు 275కిపైగా చిత్రాలు విడుదలకాగా, కేవలం 22 మాత్రమే విజయం సాధించాయి. సక్సెస్ రేట్ పరంగా గత యేడాది తరహాలోనే ఈ యేడాది కూడా నిరాశే మిగిల్చింది. ఈ యేడాది కోలీవుడ్‌కు రూ.2,705 కోట్ల లాభం, రూ.3,015 కోట్ల నష్టం వచ్చి ఉంటుందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే, తమిళ చిత్రపరిశ్రమను మాత్రం మత్తు (డ్రగ్స్) వీడటం లేదు. డ్రగ్స్ కేసులో హీరో శ్రీకాంత్ అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇలా పలు తీపి చేదు జ్ఞాపకాల యేడాదిగా మిగిలిపోయింది.
రూ.1000 కోట్ల.. కలెక్షన్ కోసం పోరాటం
దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమంలో తెలుగు, కన్నడ భాషా చిత్రాలు మాత్రమే రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించాయి. కానీ, కొన్నేళ్ళుగా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ మూవీ కోసం తమిళ చిత్రపరిశ్రమ పోరాడుతోంది. ఈ యేడాది ఎన్నడూ లేనివిధంగా 275 కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. గత యేడా దితో పోల్చితే ఈ సంఖ్య కాస్త ఎక్కువే. అదేసమయంలో 2025 లో విజయం సాధించిన చిత్రాలు మాత్రం కేవలం 22 మాత్రమే. సాధారణంగా ఆగ్ర హీరోల చిత్రాలను మినహాయిస్తే, మూడు, నాలుగో శ్రేణి హీరోల చిత్రాలకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది, కానీ, కవిన్, మణికంఠన్ వంటి చిన్న హీరోల చిత్రాలు విమర్శనాత్మకంగా, కలెక్షన్ల పరంగా మంచి శభాష్ అనిపించుకున్నాయి.
హ్యాట్రిక్ హీరో.. ప్రదీప్ రంగనాథన్
ఈ యేడాది వరుసగా రెండు విజయాలను సొంతం చేసుకున్న హీరోగా ప్రదీప్ రంగనాథన్ నిలిచారు. ఆయన నటించిన 'డ్రాగన్', 'డ్యూడ్' సినిమాలు ఘన విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. గత యేడాది ఆఖరులో వచ్చిన లవ్‌టుడే మూవీ కూడా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
దిగ్గజ దర్శకులకు కలిసిరాని కాలం
ఒకపుడు దిగ్గజ దర్శకులుగా పేరుగాంచిన శంకర్, మణిరత్నంలకు 2025 ఏమాత్రం కలిసి రాలేదు. శంకర్ మాతృభాషలో కాకుండా తెలుగులో హీరో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్ మూవీగా నిలిచింది. అలాగే, మణిరత్నం. కమల్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
'థగ్ లైఫ్': మణిరత్నం - కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నెగెటివ్ టాక్ మూటగట్టుకుని డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఫలితంగా ఆశించిన స్థాయిలో వసూళ్ళను సాధించలేకపోయింది. భారత్‌లో రూ.58.05 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.97 కోట్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు పైమాటగానే ఉంటుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
'కూలీ' : లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన 'కూలీ మూవీ దేశీయంగా రూ.330 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.520 కోట్లు వసూలు చేసింది.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' : హీరో అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించినప్పటికీ దేశీయంగా రూ.180 కోట్లు, ప్రపంచ స్థాయిలో రూ.250 కోట్లు వసూలు చేసింది. ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు.
'విడాముయర్చి': ఆజిత్ మగిళ్ తిరు మేని కలయికలో ఉన్న ఈ సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ భారత్‌లో రూ.95 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.135 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
'డ్రాగన్': తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పండించింది. ఈ చిత్రం విడుదలైన తమిళ, తెలుగు భాషల్లో రూ.118 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లు వసూలు చేసింది.
'డ్యూడ్': ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యూత్‌ను అమితంగా ఆకర్షించింది. పైగా మేకర్స్ ఊహించిన దానికంటే భారీగా వసూళ్ళను సాధించింది. దేశీయంగా రూ.86 కోట్లు. వరల్డ్ వైడ్ గా రూ.115 కోట్లు వసూలు చేసింది. తెలుగులో కాస్త నిరాశ పర్చింది.

'మదరాసి': ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దేశీయంగా రూ.73.75 కోట్లు, వరల్డ్ వైడ్ రూ.100 కోట్ల వసూ ళ్ళను సాధించింది.
'రెట్రో' : సూర్య - కార్తిక్ సుబ్బరాజ్ కల యికలో తెరకెక్కిన ఈ సినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఈ సినిమా దేశీయంగా రూ.71.35 కోట్లు, ప్రపంచ స్థాయిలో రూ.97.35 కోట్లు వసూలు చేసింది.
'తలైవన్ తలైవి' : పాండిరాజ్ దర్శక త్వంలో విజయ్ సేతుపతి- నిత్యా మీనన్ జంటగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం దేశీయంగా రూ.67.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్లు చొప్పున వసూలు చేసింది.
'టూరిస్ట్ ఫ్యామిలీ' : శశికుమార్, సిమ్రాన్ జంటగా, జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం రూ.10 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఆడియన్స్ మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి తమిళంలో రూ.70 కోట్లు, వరల్డ్ వైడ్ రూ.90 కోట్లు రాబట్టడం విశేషం.