Arjun Chakravarthy: చ‌ప్పుడు లేకుండా.. ఓటీటీకి వ‌చ్చేసిన రియ‌ల్ స్పోర్ట్స్ డ్రామా!

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:36 AM

విజ‌య రామ‌రాజు, సిజ్జా రోజ్ జంట‌గా ఓ నిజ జీవిత‌ కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి.. ది సూప‌ర్ రైడ్.

Arjun Chakravarthy

విజ‌య రామ‌రాజు (Vijaya Rama Raju), సిజ్జా రోజ్ (Sijaa Rose) జంట‌గా ఓ నిజ జీవిత‌ కబడ్డీ ఆటగాడి జీవితం ఆధారంగా స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన చిత్రం అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి.. ది సూప‌ర్ రైడ్ (Arjun Chakravarthy). విక్రాంత్ రుద్ర (Vikrant Rudra)దర్శకత్వం వ‌హించ‌గా శ్రీని గుబ్బల నిర్మించాడు. విజ్ఞేష్ భాస్క‌ర‌న్ (Vignesh Baskaran) సంగీతం అందించాడు. ఓ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ నిజ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 29న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే ప్ర‌చార కార్య‌క్ర‌మాల లోపం వ‌ల్ల సినిమా ప్ర‌జ‌ల‌కు అంత‌గా రీచ్ కాలేక పోయింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే స‌డ‌న్‌గా ఓ ప్ర‌ముఖ ఫ్లాట్‌ఫాంతో డిజిటల్‌స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. 1980-90ల కాలంలో అర్జున్ చక్రవర్తి నే అనాథ బాలుడిని రంగ‌య్య అనే మాజీ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ చేర‌దీస్తాడు. అక్క‌డ ఆట‌లో ప్రావీణ్యం సంపాదించుకున్న అర్జున్ జాతీయ స్థాయిలో ఆడాల‌ని తాప‌త్ర‌య ప‌డుతుంటాడు. ఈ నేప‌థ్యంలో ఓ మ్యాచ్ కోసం మ‌రో ప్రాంతానికి వెళ‌తాడు వెళ్లి వ‌చ్చే స‌రికి త‌ను ప్రేమిస్తున్న దేవిక విష‌యంలోనే కాక అర్జున్ జీవితంలో అనుకోని ఘ‌ట‌న‌లు అనేకం జ‌రిగి క‌బ‌డ్డీని దూరం పెట్టాల్సిన పిస్థితి వ‌స్తుంది. ఇంత‌కు అక్క‌డ జ‌రిగిన ప‌రిణామాలేంటి, క‌బ‌డ్డీని ఎందుకు వ‌దిలేశాడు, మ‌ధ్య‌లో వ‌చ్చిన కోచ్ కుల‌క‌ర్ణి ఎవ‌రు, త‌న‌ను పెంచిన రంగ‌య్య క‌థేంటి చివ‌ర‌కు త‌న క‌ల నేర‌వేర్చుకున్నాడా లేదా అను ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

Arjun Chakravarthy

మ‌న‌కు తెలిసిన క‌థ‌లానే ఉన్న‌ప్ప‌టికీ విజయ్ రామరాజు నటన, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డైలాగులు, బీజీఎం సినిమాను మ‌రో లెవ‌ల్‌లో నిల‌బెట్టాయి. ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా డైలాగ్స్ అయితే ఇంత‌వ‌ర‌కు ఏ సినిమాలో రాని విధంగా మ‌రో లెవ‌ల్‌లో ఉంటాయి. సుమారు తొమ్మిదేండ్లుగా నిర్మాణం చేసుకున్న ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో లొకేషన్లలో చిత్రీకరించడం విశేషం. అంతేగాక సినిమా విడుద‌ల‌కు ముందే 46 అంత‌ర్జాతీయ వేదిక‌ల్లో అవార్డులు అందుకోవ‌డం విశేషం. అయితే.. చాలా సీన్స్ సాగదీతగా ఉన్న‌ట్లు అనిపించి స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేద‌ని అనిపిస్తుంది. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT)లో ఈ రోజు (అక్టోబ‌ర్ 24 శుక్ర‌వారం) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, స్ట్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఇష్ట ప‌డే వారికి ఈ సినిమా మంచి స‌జేష‌న్‌.

Updated Date - Oct 24 , 2025 | 09:36 AM