Madharaasi: శివకార్తికేయన్ ‘మదరాసి’.. ఓటీటీకి వ‌చ్చేసింది

ABN , Publish Date - Oct 01 , 2025 | 07:06 AM

రజనీకాంత్‌తో ‘దర్బార్’ తీసిన ఐదేళ్ల తర్వాత దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ మరోసారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘మదరాసి’.

Madharaasi

సూపర్ స్టార్ రజనీకాంత్‌(Rajinikanth)తో ‘దర్బార్’ తీసిన ఐదేళ్ల తర్వాత దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ మరోసారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘మదరాసి’ (Madharaasi). అయితే ఈ ఏడాదే ఆయన సల్మాన్ ఖాన్‌(Salmankhan)తో చేసిన ‘సికిందర్’ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో, ఈ సినిమాపై అన్ని కళ్లూ ఉన్నాయి. ఆయితే.. హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా గత దీపావళికి వచ్చిన ‘అమరన్’ 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దాంతో ‘మదరాసి’ని కూడా ఎక్కువగా మురుగదాస్ సినిమా కంటే శివకార్తికేయన్ మూవీగా చూసే పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబ‌ర్ 5న థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ చిత్రం అక్టోబర్ 1 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది.

తమిళనాడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం. కానీ కొంతమంది దాన్ని అస్థిరం చేయాలని గన్ కల్చర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఆ కుట్రలో భాగంగా ఆరు ట్రక్కుల అక్రమ ఆయుధాలను రాష్ట్రంలోకి తరలిస్తారు. దీనిని అడ్డుకోవడానికి ఎన్.ఐ.ఎ. అధికారులు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో మానసిక సమస్యలతో ఆసుపత్రిలో ఉన్న రఘురామ్ (శివకార్తికేయన్) అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. అతని ప్రేమికురాలు మాలతి (రుక్మిణీ వసంత్) కూడా ఈ ప్లాన్‌లో చిక్కుకుంటుంది. చివరికి ఎన్.ఐ.ఎ. అధికారులు ఆపరేషన్‌ను పూర్తి చేయగలిగారా? రఘు తన సమస్యల నుంచి బయటపడ్డాడా? మాలతి ప్రాణాలతో బయటపడిందా? అనేదే మిగతా కథ.

Madharaasi

మురుగదాస్ ఎంచుకున్న పాయింట్ బలంగా అనిపించదు. తమిళనాడులో గన్ కల్చర్ లేదని చెప్పడం ఓవర్‌గా అనిపిస్తుంది. ఆరు ట్రక్కుల ఆయుధాలను ఆపే బాధ్యతను మానసిక సమస్యలున్న వ్యక్తికి ఇవ్వడం కూడా లాజిక్‌లెస్‌గా ఉంటుంది. క్లైమాక్స్ యాక్షన్ బాగా ఉన్నా, లెంగ్త్ ఎక్కువైంది. శివకార్తికేయన్ తన నటనతో సినిమా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రుక్మిణీ వసంత్ (rukmini), విద్యుత్ జమ్వాల్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటారు. ‘మదరాసి’లో మురుగదాస్ స్టైల్ కనిపించకపోయినా, శివకార్తికేయన్ అభిమానులు మాత్రం కొంతమేరకు ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video) ottలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ అందుబాటులోకి వ‌చ్చింది. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు ఒక‌మారు చూసేయ‌వ‌చ్చు.

Updated Date - Oct 01 , 2025 | 11:21 AM