3BHK OTT: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన.. మధ్య తరగతి భారతం
ABN , Publish Date - Aug 01 , 2025 | 07:32 AM
బొమ్మరిల్లు సిద్ధార్థ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం 3BHK
జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న బొమ్మరిల్లు సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్ (SarathKumar) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం 3BHK. గత నెల జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయం సాధించింది. దేవయాని (Devayani), మీతా రఘునాథ్ (Meetha Raghunath), చైత్ర ఆచార్ (Chaithra J. Achar), యోగి బాబు (Yogi Babu) కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ శ్రీగణేష్ (Sri Ganesh) దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
సొంత ఇల్లు అనేది ఓ గౌరవం అందుకోసం ఓ మధ్య తరగతి కుటుంబం పడిన పాట్లు, ఎదుర్కొన్న సవాళ్లు నేపథ్యంలో సినిమాను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ జీవిత సవాళ్లు, తల్లిదండ్రుల త్యాగం, కొడుకు బాధ్యత, వారి కలల వెనుక దాగిన బాధ ఇలా ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. పిల్లలు పుట్టిన తర్వాతి నుంచి సొంతిల్లు నిర్మించుకోవాలని ఎన్నో సార్లు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్లి ఆర్థిక పరిస్థితి సహకరించక , ఆ కల కలగానే మిగిలి పోతుంది. ఇంతకీ ప్రభు ఇల్లు కొన్నాడా? సొంత ఇల్లు అనేది ఓ గౌరవం అని నమ్మే తన తండ్రి కోరిక నెరవేరిందా? ఈ మధ్యలో ఆర్తి పెళ్లి ఆ తర్వాత వచ్చిన సమస్య, ఐశ్వర్యతో ప్రభు ప్రేమ ఇవన్నీ ఎలా నడిచాయి అన్న ఆసక్తికర పాయింట్‌తో రూపొందించారు.
సినిమా ఎక్కువ భాగం స్లో నేరేషన్‌లో ఉన్నా దిగువ మధ్య తరగతి కుటుంబం పడే స్ట్రగుల్స్, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారనేది దర్శకుడు చాలా హృద్యంగా చూపించారు. జాబ్ సంపాదించుకోవడం, చెల్లి కోసం త్యాగం, నచ్చిన పని చేస్తే అందులో ఉండే కిక్కు ఇలాంటి ఎమోషన్స్ ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ఇప్పుడీ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon PrimeVideo), సింప్లీ సౌత్ (SimplySouth) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్‌లో మిస్సయిన వారు, మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రం మంచి ట్రీట్. అసలు మిస్సవద్దు. అమృత్ రామ్‌నాథ్ సంగీతంలో పాటలు కూడా బావుంటాయి.