Weapons OTT: ఓటీటీలో.. వెన్నులో వ‌ణుకు పుట్టించే హ‌ర్ర‌ర్ సినిమా! కేవ‌లం వారికి మాత్ర‌మే

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:04 PM

గ‌త నెల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సైలెంట్‌గా వ‌చ్చి సాలీడ్ హిట్ సాధించిన హాలీవుడ్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం వీప‌న్స్.

Weapons OTT

గ‌త నెల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి సైలెంట్‌గా వ‌చ్చి సాలిడ్ హిట్ సాధించిన హాలీవుడ్ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం వీప‌న్స్ (Weapons). ఆగ‌స్టు8న ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన ఈ చిత్రం మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని నెల రోజులుగా విడుద‌లైన అన్ని చొట్ల నుంచి మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. సుమారు 40 మిలియ‌న్ డాల‌ర్ల‌తో (రూ.334 కోట్లు) రూపొందిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా 251 మిలియ‌న్ డాల‌ర్లు (రూ.2100 కోట్లు) కొల్ల‌గొట్టి హ‌ర్ర‌ర్ చిత్రాల్లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. జాక్ క్రెగ్గర్ (Zach Cregger) స్వ‌యంగా నిర్మించి ద‌ర్శ‌క‌త్వం చేసిన ఈ చిత్రంలో జోష్ బ్రోలిన్ (Josh Brolin), జూలియా గార్నర్ (Julia Garner), ఆల్డెన్ ఎహ్రెన్‌రిచ్, ఆస్టిన్ అబ్రమ్స్, క్యారీ క్రిస్టోఫర్, టోబి హస్, బెనెడిక్ట్ వాంగ్, అమీ మాడిగాన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Weapons

క‌థ విష‌యానికి వ‌స్తే.. పెన్సీవ్లేనియా సిటీలోని ఓ స్కూల్‌లో థ‌ర్డ్ గ్రేడ్ చ‌దువుతున్న‌ 17 మంది విద్యార్థులు ఓ రోజు రాత్రి 2.30 గంట‌ల స‌మ‌యంలో త‌మ త‌మ ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌రుగెత్తుకెళ్లి చీక‌ట్లో మాయమై పోతారు. ఆ మ‌రుస‌టి రోజు ఆ క్లాస్‌కు సంబంధించిన టీచ‌ర్ జ‌స్టిన్ త‌ర‌గ‌తి గ‌దికి రాగా అక్క‌డ అలెక్స్ అనే స్టూడెంట్ త‌ప్పితే ఎవ‌రూ ఉండ‌రు. అదే స‌మ‌యంలో క‌నిపించ‌కుండా పోయిన పిల్ల‌ల పేరెంట్స్ సైతం స్కూల్‌కు వ‌చ్చి క్లాస్ టీచ‌ర్ ఏదో చేసింది అందుకే మా పిల్లలు మాయ‌మై పోయారు అంటూ గొడ‌వ‌కు దిగుతారు. దీంతో ప్రిన్సిపాల్ జ‌స్టిన్‌కు లాంగ్ లీవ్ ఇచ్చి దూరంగా వెళ్లి పొమ్మంటాడు. అయితే పిల్లల‌కు ఏం జ‌రిగింది, ఉన్న‌ట్టుండి ఎందుకు క‌నిపించ‌కుండా పోయారు అనే అనుమానంతో త‌న‌కు తెలిసిన‌ పోలీస్ హెల్ప్ తీసుకుని పిల్ల మాయం వెనుక సీక్రెట్ తెలుసుకుందామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటుంది. అదే స‌మ‌యంలో ఓ పేరెంట్ సాయం కూడా తీసుకుని మొబైల్‌ ట‌వ‌ర్ ఆధారంగా వెతుకుతూ ఆ రేడియ‌స్ లోని పిల్లలు మాత్ర‌మే మిస్ అయ్యార‌ని తెలుసుకుంటారు.

Weapons

మ‌రో వైపు.. బాగా డ్ర‌గ్ అడిక్ట్ అయిన ఓ దొంగ చేతిలో డ‌బ్బు లేక ఇండ్ల‌లో గిన్నెలు, పుస్త‌కాలు ఏది చేతికందితే అది దొంగ‌లించి షాపులో అమ్మి వ‌చ్చిన డ‌బ్బుల‌తో డ్ర‌గ్స్ తీసుకుంటాడు. ఈ నేప‌థ్యంలో ఓ ఇంట్లో దొంగ‌త‌నానికి వెళ్లిన అత‌నికి అక్క‌డ ఇల్లు, ఇంట్లోని మ‌నుషులంతా అబ్‌నార్మ‌ల్‌గా ఉండ‌డం చూసి షాక్ అవుతాడు. అక్క‌డ చూసిన మ‌రి కొన్ని దృశ్యాల గురించి పోలీస్‌కు స‌మాచారం ఇచ్చి అత‌నితో క‌లిసి ఆ ఇంటికి వెళ్లి తిరిగి బ‌య‌ట‌కు రారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఆ ఇంట్లో ఏం జ‌రిగింది, అక్క‌డ‌కు పోయిన వారు ఏమ‌య్యారు, ఇంత‌కు 17 మంది పిల్ల‌లు ఎలా మాయ‌మయ్యారు, ఎందుకు క‌నిపించ‌కుండా పోయారు, వారికి ఆ ఇంటికి సంబంధం ఏంటి, ఈ ర‌హాస్యాన్ని చేధించ గ‌లిగారా లేదా అనే థ్రిల్ చేసి క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

మ‌న ఇండియాలో అంద‌రికీ తెలిసిన ఓ ప్ర‌ధాన‌ మూఢ న‌మ్మ‌కం త‌ర‌హా క‌థ‌తో ఈ చిత్రం రూపొందించ‌డం విశేషం. సినిమా ఆరంభమే స్ట‌న్నింగ్ సీన్‌తో ఆరంభ‌మై ఆపై స్లోగా ఛాఫ్ట‌ర్ వైస్‌గా మూవీ న‌డుస్తూ.. చివ‌రి న‌ల‌భై నిమిషాల నుంచి చూసే ప్ర‌తి ఒక్క‌రిని సీట్ ఎడ్జ్‌లో కూర్చో బెడుతుంది. ఒక్కోసారి వెన్నులో వ‌ణుకు రావ‌డం కూడా ఖాయమ‌నే విదంగా స‌న్నివేశాలు ఉండి జ‌ల‌ద‌రింప చేస్తాయి. ఇప్పుడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT)లో రెంట్ ప‌ద్ద‌తిలో అందుబాటులోకి వ‌చ్చింది. హ‌ర్ర‌ర్‌, థ్రిల్ల‌ర్, వ‌య‌లెన్స్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు, థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు త‌ప్ప‌క చూడాల్సిన మూవీ ఇది. అయితే ప్ర‌ధ‌మార్థంలో ఓ ఇంటిమేట్ స‌న్నివేశం, చివ‌ర్లో వ‌చ్చే వ‌య‌లెన్స్ స‌న్నివేశాలు.. ఇంకా చెప్పాలంటే సినిమా థీమ్ దృష్ట్యా పిల్ల‌లు మిన‌హా అంద‌రూ ఈ వీప‌న్స్ (Weapons) చిత్రం చూడ‌వ‌చ్చు.

Updated Date - Sep 09 , 2025 | 02:56 PM