Su from So OTT: రవన్న.. ఓటీటీకి వచ్చేశాడు! ఇక నవ్వులే.. నవ్వులు
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:31 AM
గత నెలలో అనామకంగా కన్నడ నాట థియేటర్లలోకి వచ్చి అక్కడి ప్రజలనే షాక్ గురి చేసేంతగా సంచలన విజయం సాధించిన చిత్రం సూ ఫ్రం సో.
గత నెలలో అనామకంగా కన్నడ నాట థియేటర్లలోకి వచ్చి అక్కడి ప్రజలనే షాక్ గురి చేసేంతగా సంచలన విజయం సాధించిన చిత్రం సూ ఫ్రం సో (Su from So). ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రూ.5 కోట్లతో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి రూ.125 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది. ఆపై మలయాళ, తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదమై మంచి ఫలితాలను రాబట్టుకుంది. తాజాగా హిందీలో విడుదలకు సిద్దమైంది. ఇప్పుడీ చిత్రం మంగళవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కర్ణాటకలోని ఓ మారుమూల పల్లెలో ప్రజలంతా కల్లా కపటం లేకుండా అంతా కలిసి మెలిసి ఉంటాడు. వారందరికీ మధ్య వయస్కుడైన, ఇంకా పెళ్లి అవ్వని రవి పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎవరికైనా సమస్య ఉందీ అంటే తానే ముందు వరుసలో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. మరోవైపు అశోక్ అనే యువకుడు తను లవ్ చేసే అమ్మాయి బాత్రూమ్‌లో ఉందనుకుని చూద్దామని వెళ్లగా అక్కడ భామ ఉండడంతో షాకవుతాడు. ఆ భామ దొంగ వచ్చాడని అరవడంతో అది కాస్త తెల్లారేసరికి ఊరంతా ప్రచారం జరిగి దొంగను వెతికే పనిలో ఉంటారు.
ఇదంతా చూసి ఖంగుతిన్న అశోక్ అ వ్యవహారాన్ని మైమరిపించాలని దయ్యం పట్టినట్లు నటించడం మొదలు పెడతాడు. దాంతో ఊరంతా భయపడి ఆ ఇంటికి , అశోక్‌కు దూరంగా ఉంటుంటారు. ఈక్రమంలో ఆ ఊరి పెద్ద మనిషి రవి ఎంటర్ అవడం, దయ్యాన్ని వదిలించేందుకు స్వామీజీని తీసుకు రావడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. పక్క ఊరికి చెందిన సులోచన అనే దయ్యం అవహించిందని నిర్ణయించి దాని కోరికలేంటో తెలుసుకుని ఆ దయ్యాన్ని వదిలించాలని చూస్తారు.
ఈ నేపథ్యంలో అశోక్ చేసిన ఫ్లాన్ ఎలాంటి టర్న్ తీసుకుంది, సులోచన అనే దయ్యం ఎందుకు వచ్చింది, దాని బ్యాగ్రౌండ్ ఏంటి, వీటి మధ్యలో రవి, ఆయన మిత్రుల పాత్ర ఏంటి అనే ఆసక్తికరమైన కథ కథనాలతో పూర్తి హస్యరస భరితంగా సినిమా తెరకెక్కింది. ఎక్కడా బోర్ అనే ఫీల్ రాకుండా అక్కడి పరిసరాలు, కొత్త లొకేషన్స్, సింగిల్ లైనర్ డైలాగ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఇప్పుడీ సినిమా జియో హాట్ స్టార్ (JioHotstar) ఓటీటీలో కన్నడతో పాటు తెలుగు ఇతర దక్షణాది భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. మంచి స్ట్రెస్ బస్టర్, కాసేపు ఫ్యామిలీతో హాయిగా నవ్వుకుందాం అనే వారు ఈ సూ ఫ్రం సో (Su from So) సినిమాను అసలు మిస్ చేయవద్దు.