Kothapallilo Okappudu: ఆ ఓటీటీకి.. నాటు సరసం సినిమా! ఎప్పటినుంచంటే?
ABN , Publish Date - Aug 11 , 2025 | 07:42 AM
కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత, నటి ప్రవీణ పరుచూరి.
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నిర్మాత, నటి ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) ఇటీవల ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ (Kothapallilo Okappudu) అనే ఓ కొత్త సినిమాతో గత నెల జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి తానే స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్రలోనూ నటించిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీతో మనోజ్ చంద్ర (Manoj Chandra), మౌనిక (Monika T), ఉషా బోనెల (Usha Bonela) హీరో హీరోయున్లుగా పరిచయం అవగా రవీంద్ర విజయ్ (Ravindra Vijay), బెనర్జీ, బొంగు సత్తి, ఫణి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
కథ విషయానికి వస్తే.. కొత్తపల్లి అనే గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే అప్పన్నప్రజలను పీడిస్తూ, వారి భూముల్ని లాక్కుంటాడు. ఆ భూముల్లో నిధులు ఉంటాయని నమ్ముతాడు. అయితే తన కళ్లముందే అప్పన్న ఎదిగడం ఆ ఊరిలోని భూస్వామి రెడ్డి) తట్టుకోలేక పోతాడు. ఇదిలాఉంటే అతని మనవరాలు సావిత్రిని అప్పన్న దగ్గర పనిచేసే రికార్డింగ్ డాన్స్ కంపెనీ రామకృష్ణ ప్రేమిస్తాడు. ఈ క్రమంలో సావిత్రి దగ్గర పనిచేసే ఆదిలక్ష్మీని ఓ సాయం కోరతాడు. అయితే.. ఆదిలక్ష్మీతో రామకృష్ణ సన్నిహితంగా మెలగడాన్ని ఊరి జనం చూసి వారి మధ్య ఏదో ఉందనుకుంటారు. ఆ అనుమానం కాస్త రామకృష్ణ ఆదిలక్ష్మీని పెళ్లాడాల్సిన స్థితికి తీసుకొస్తుంది. ఈ ఊహించని పరిస్థితుల నుంచి రామకృష్ణ ఎలా బయటపడ్డాడు? తనకు - సావిత్రికి పెళ్ళి చేస్తానని మాట ఇచ్చిన అప్పన్న ఏమయ్యాడు? ఊరి పెద్ద రెడ్డి తన మనవరాలిని రామకృష్ణకు ఇచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించాడా? అనే నేపథ్యంలో కథ నడుస్తుంది.
భారత గ్రామీణ ప్రజల మూఢత్వాన్ని విశ్వాసాలను ప్రశ్నిస్తూ 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నప్పటికీ అది తెర మీదకు వచ్చే సరికి కాస్త గందరగోళం అయింది. పాత్రలను తెరకెక్కించిన విధం బాగానే ఉన్నా.. మొత్తంగా కథ చెప్పిన పద్థతి, ప్రేక్షకులకు కనెక్ట్ అవదు. పాటలు, వాటి చిత్రీకరణ బావుంటాయి. ఇప్పుడీ చిత్రం ఆగస్టు 22 నుంచి ఆహా (ahavideoIN) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓ కొత్త తరహా చిత్రం చూడాలనుకునే వారు ఈ సినిమాను ప్రయత్నించవచ్చు.