DiesIrae OTT: ఒళ్లు గగుర్పొడిచే.. సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేసింది! తెలుగులోనూ
ABN , Publish Date - Dec 05 , 2025 | 09:48 AM
అక్టోబర్ నెల చివరలో మలయాళంలో థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ .
అక్టోబర్ నెల చివరలో మలయాళంలో థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ (Dies Irae). గత సంవత్సరం మమ్ముట్టితో 'భ్రమయుగం' అనే హర్రర్ సినిమాను తెరకెక్కించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న రాహుల్ సదాశివన్ (Rahul Sadasivan) ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ (Pranav Mohanlal) ఈ మూవీలో హీరోగా నటించగా ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ (Sravanthi Movies) స్రవంతి రవి కిశోర్ ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ మొదటి వారం ప్రేక్షకుల ఎదుటకు తీసుకు వచ్చారు. కానీ ప్రజలకు రీచ్ కాలేక పోయింది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

కథ విషయానికి వస్తే.. బాగా డబ్బున్న ఆర్కిటెక్ట్ రోహన్ తరుచూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. అయితే .. ఓ రోజు తన క్లాస్‌మేట్, గతంలో రిలేషన్‌లో ఉన్న కని చనిపోయిందని తెలుసుకుని వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కనికి గుర్తుగా ఆమె హెయిర్ క్లిప్‌ను తన వెంట తెచ్చుకుంటాడు. అది మొదలు రోహన్‌ను ఓ ఆత్మ వెంటాడుతూ భయ పెడుతూ ఉంటుంది. ఓసారి కని తమ్ముడు కిరణ్ రోహన్ ఇంటికి రాగా ఆత్మ అతన్ని మేడపై నుంచి కిందకు పడేస్తుంది. అప్పుడే అది కని ఆత్మ కాదు ఓ మగాడి ఆత్మ అని తెలుస్తుంది. ఇంతకు ఆ ఆత్మ ఎవరిది, దాని స్టోరి ఏంటి, రోహన్‌కు దానికి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు అంతలా ఇబ్బంది పెట్టిందనేదే స్టోరి.
మనం ఇప్పటి వరకు చూసిన మాములు హర్రర్ థ్రిల్లర్ తరహా సినిమాలకు పూర్తి భిన్నంగా అంతర్జాతీయ స్థాయి టేకింగ్‌తో ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలతో ఈ సినిమా రూపొందింది. సినిమా రొటీన్‌గా ప్రారంభమైనా వెళుతున్న కొద్ది థ్రిల్లింగ్ సన్నివేశాలు యాడ్ అవుతూ సినిమా చూసే వారిని సీటులో అలాగే అతుక్కుపోయేలా చేస్తుంది. ప్రతి సీన్ భయభ్రాంతులకు గురయ్యేలా, అనుక్షణం ఉత్కంఠత ఉండేలా రూపొందించాడు. ఇంటర్వెల్ ట్విస్టు రివీల్ అయ్యాక ఇన్వెస్టిగేషన్ నుంచి ఇంటెన్సిటీ మరింత పెరుగుతుంది. ఇప్పుడీ ‘డీయస్ ఈరే’ (Dies Irae) సినిమా జియో హాట్‌స్టార్‌లో మలయాళంలో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్సయిన వారు, హర్రర్ సినిమాలు ఇష్టపడే వారు మస్ట్‌గా చూడాల్సిన చిత్రం ఇది. అయితే.. హృదయ సంబంధ సమస్యలు ఉన్న వారు ఈ మూవీకి దూరంగా ఉండడం ఉత్తమం.