8 Vasantalu: కవితాత్మక ప్రేమకథ.. 8 వసంతాలు ఇప్పుడు ఆ ఓటీటీలో
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:57 AM
జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ప్రేమకథా చిత్రం 8 వసంతాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
జూన్‌లో థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం 8 వసంతాలు (8 Vasantalu). గతంలో 'మను', మధురం వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వం వహించాడు. మ్యాడ్ ఫేం అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanil Kumar) లీడ్ రోల్‌లో నటించగా రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇప్పుడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే.. సినిమా విడుదల అనంతరం బ్రాహ్ముణుడిపై చిత్రీకరించిన ఓ సన్నివేశంపై జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్న బాగా వైరల్ అవడం విశేషం.
కథ విషయానికి వస్తే.. శుద్థి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) స్ట్రాంగ్ లేడీ. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా పదిహేడేళ్లకే భావోద్వేగభరితంగా ఓ పుస్తకం రాస్తుంది. అది చదివి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారతారు. మార్షల్ ఆర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న శుద్ధికి మార్షల్ డోజోలో వరుణ్ (హను రెడ్డి) పరిచయం అవుతుంది. అతడు.. ఆమె ప్రేమకోసం వెంటపడతాడు. తీరా శుద్ధి ఆమె తన ప్రేమను చెప్పేలోపు వరుణ్ తన గోల్ కోసం ఆమెను వదిలించుకుని విదేశాలకు వెళ్లిపోతాడు. పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది.
తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు. అతనిని శుద్ధి ప్రేమిస్తుంది. తల్లికి చెబుదామనుకునేలోపు తల్లి ఆరోగ్యం బాగోక పోవడం, ఎస్టేట్స్ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది. తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను మనసులోనే దాచుకుంటుంది. సంజయ్ ఆమె ప్రేమను గెలిచాడా? 8 వసంతాలకు, సంజయ్‌కు సంబంధం ఏంటి? అన్నది కథ.
2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమకథ '8 వసంతాలు'. స్ట్రాంగ్ అండ్ టాలెంటెడ్ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమకథగా మలిచారు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకూ ఫ్లో బావుంది. అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా ఉన్నా.. శుద్ధి పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ సాగదీత అనేది గుర్తుకు రాదు. దర్శకుడు కథను పూర్తిగా కవితాత్మకంగా తెరపై చూపించాలనుకున్నాడు. ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేసిన భావన కలుగుతుంది. మాటలు బాగా రాసుకున్నాడు అయితే తన రాతతో కథను మించి కవిత్వం పెరిగింది.
కొన్ని సందర్భాల్లో సంభాషణలను కవిత్వమే డామినేట్ చేసింది. వరుణ్ క్యారెక్టర్ ఎంట్రీ, అతని రన్ చూస్తే నెగటివ్ అని గెస్ చేసేలా ఉంది. ఇంటర్వెల్ వరకూ సినిమా ఒకలా ఉంటే.. అక్కడి నుండి మరోలా ఉంది. కొన్ని డైలాగ్స్ మాత్రం మనసుల్ని కట్టిపడేస్తాయి. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో చూడని వారు, సింపుల్, కూల్ లవ్‌స్టోరీలను ఇష్టపడే వారు ఈ 8 వసంతాలు (8 Vasantalu) చిత్రాన్ని ఓ మారు ట్రై చేయొచ్చు. సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్‌రెడ్డి విజువల్స్, హేషమ్ అబ్దుల్ వాహబ్ వినసొంపైన పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.