Tourist Family OTT Review: తెలుగులోను ఓటీటీకి వ‌చ్చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ!

ABN , Publish Date - Jun 02 , 2025 | 07:14 AM

త‌మిళ‌నాట నెల రోజుల క్రితం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

tourist family

ఏప్రిల్ 29న త‌మిళ‌నాట చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించి అక్క‌డి ఆల్ టైం క్లాసిక్స్ సినిమాల‌ జాబితాలో చేరిన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). ఫ్యామిలీ, కామెడీ, ఎమోష‌న‌ల్ డ్రామాగా కేవ‌లం రూ.8 కోట్ల వ్య‌యంతో నిర్మిత‌మైన ఈ మూవీ, పెట్టిన దానికి ప‌దింతల లాభాలు తెచ్చి పెట్టింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.80 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబట్టి నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శ‌శి కుమార్ (Sasikumar), సిమ్ర‌న్ (Simran) జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఇంకా దేశ‌ వ్యాప్తంగా వంద‌ల థియేట‌ర్ల‌లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ర‌న్ అవుతుండ‌గానే ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. రాజ‌మౌళి, నాని వంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి ఆకాశానికెత్తేశారంటే సినిమా ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

క‌థ విష‌యానికి వ‌స్తే...

కొవిడ్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ధరమ్ దాస్ (శశికుమార్), వాసంతి (సిమ్రాన్) తమ పిల్లలతో కలిసి, శ్రీలంక నుంచి అక్రమంగా భార‌త దేశంలోని రామేశ్వరం వచ్చేస్తారు. అక్కడ నుండి వాసంతి అన్నయ్య సాయంతో చెన్నయ్ చేరి అక్కడ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారి భాషలో శ్రీలంక యాసను ఇట్టే జనాలు గుర్తు పడతారు కాబట్టి వీలైనంత వరకూ మనుషులకు దూరంగా ఉండమని వాసంతి అన్నయ్య సలహా ఇస్తాడు. కానీ తోటి వారికి ఏదో రకంగా సాయం చేయకుండా ఉండలేని బలహీనత కారణంగా ధరమ్ దాస్ ఆ మాటలను పట్టించుకోడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే ఓ కాలనీలో వీళ్ళకు ఇల్లు దొరకుతుంది. ఒకరి గురించి ఒకరు పట్టించుకోని ఈ కాలనీలోని కుటుంబాలలో ధరమ్ దాస్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఎంతో మార్పు వస్తుంది. అందరినీ కలుపుతూ, అందరి సమస్యలను పరిష్కరిస్తూ అక్కడ ప్రతి ఇంటిలోనూ నవ్వుల పువ్వులు పూయిస్తారు ఈ దంపతులు. అదే స‌మ‌యంలో రామేశ్వరంలో బాంబు దాడి జ‌రిగి కొందరు గాయపడతారు. దానికి కారణం శ్రీలంక నుండి వచ్చిన ఓ టెర్రరిస్ట్ ఫ్యామిలీ అని పోలీసులు అనుమానిస్తారు. వారి దృష్టి ధరమ్ దాస్ కుటుంబం పై పడుతుంది. జీవిక కోసం శ్రీలంక నుండి శరణార్ధుల మాదిరి భారత్ కు వచ్చిన వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుండి ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ.

GsZhsEVboAAkTQD.jpg


ఎలా ఉందంటే...

ఇటీవ‌ల వ‌స్తున్న మాస్‌ మ‌సాలా, రొట్ట కొట్టుడు, వ‌య‌లెన్స్ సినిమాలతో విసిగిపోయిన వారికి 'టూరిస్ట్ ఫ్యామిలీ' అరుదుగా ల‌భించే అమృతంలా అనిపిస్తుంది. పాతికేళ్ళ అభిషన్ జీవింత్ (Abishan Jeevinth) ఈ ఈ సినిమాతో దర్వకుడిగా అరంగేట్రమ్ చేశాడు. అతనే కథనూ రాసుకున్నాడు. మ‌నుషులుగా పుట్టిన‌ వారు తోటి వారితో ఎలా మెల‌గాల‌నేది హస్యభరితంగా తెలిపాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఊహించిన సరదా సరదా ట్విస్టులతో సాగిపోతుంది. టెర్రరిస్ట్ ఫ్యామిలీ అనే ముద్ర పడిన తర్వాత ఎలాంటి అరాచక, భయానక దృశ్యాలను తెర మీద చూడాల్సి వస్తుందో అనే సందేహ పడిన వారిని సైతం దర్శకుడు కూల్ చేసేసిన విధానం బాగుంది. సహజంగా ఇలాంటి సంక్లిష్టమైన కథను తీసుకున్నప్పుడు తీవ్రస్థాయిలో హింసను, పోరాట సన్నివేశాలను దర్శకులు చూపించడానికి తహతహ లాడతారు. కానీ కేవలం ఎమోషన్ తో ఈ కథను యువ దర్శకుడు అభిషన్ డీల్ చేసిన విధానం చూస్తే ముచ్చటేస్తుంది. ముఖ్యంగా ధరమ్ దాస్ ఉద్యోగం పోయిందని తాగి వచ్చినప్పటి సన్నివేశం, కాలనీ వాసులు ఒకరు చర్చిలో తన పరిస్థితిని వివరించిన సన్నివేశం మూవీకి ఆయువు పట్టు లాంటివి.


నటీనటుల విషయానికి వస్తే...

తమిళనాట శశికుమార్ కంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. రొటీన్ కు భిన్నమైన కథలను అతను ఎంపిక చేసుకుంటాడు. అతను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి, మరికొన్ని రీమేక్ కూడా అయ్యాయి. ఇటీవల వచ్చిన 'భైరవం' మాతృక 'గరుడన్'లో శశికుమారే హీరో. ఇందులో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు శశికుమార్. ఇక సిమ్రాన్ కు శ్రీలంక శరణార్దుల సినిమాలకు ఏదో అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. మణిరత్నం తెరకెక్కించిన 'అమృత' కూడా శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో సాగే చిత్రమే. ఇందులో సిమ్రాన్ పాత్ర మీద దర్శకుడు పెద్దంత ఫోకస్ పెట్టలేదు. కానీ ఆమె లేని సన్నివేశం అంటూ ఉండదు. అలానే వీరి కొడుకులుగా నటించిన మిధున్ జై శంకర్, మాస్టర్ కమలేష్ జగన్ చక్కగా తమ పాత్రలను పోషించారు. ఇతర ప్రధాన పాత్రలను ఎమ్మెస్ భాస్కర్, రమేశ్‌ తిలక్, భగవతి పెరుమాళ్, ఇలంగో కుమారవేల్, శ్రీజ రవి, రామ్ కుమార్ ప్రసన్న, యోగలక్ష్మీ తదితరులు చేశారు. ఇందులో కీలకమైన తాగుబోతు పాత్రను చేసింది దర్శకుడు అభిషన్ జీవింత్ కావడం విశేషం.

జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఉంది. డబ్బింగ్ పర్ ఫెక్ట్ గా చేయకపోయినా... డైలాగ్స్ వరకూ ఫర్వాలేదు. ఫీల్‌గుడ్ సినిమాలను ఇష్టపడే వారికి, కుటుంబం అంతా క‌లిసి చూడాల‌నుకునే వారికి దీనిని మించిన చిత్రం మ‌రోటి ఉండదు. సో... టూరిస్ట్ ఫ్యామిలీని చూడ‌డం మిస్ చేయ‌కండి.

ట్యాగ్ లైన్: హ్యూమనిస్ట్ ఫ్యామిలీ!

రేటింగ్ : 3.5 / 5

Updated Date - Jun 03 , 2025 | 11:37 AM