Mahavathar Narasimha: ఫర్‌ఫెక్ట్ టైంలో.. ఓటీటీలో దిగింది! ఇక ఇండ్లన్నీ మటాషే
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:46 PM
బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి సినీ పండితులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేసిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహా సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది
రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి, రికార్డు కలెక్షన్లు వసూలు చేసి సినీ పండితులను సైతం సంబ్రమాశ్చర్యాలకు గురి చేసిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహా (Mahavatar Narsimha) చిత్రం సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో చాలా రోజులుగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న వారికి సర్‌ఫ్రైజ్ ఇస్తూ.. వారం ముందుగానే పండుగను ప్రతి ఇంటికి తీసుకు రావడంతో ప్రతి ఒక్కరూ ఫుల్ ఖుషి అవుతున్నారు.
భారీ నిర్మాణ సంస్థ హోంబులే (hombale films) తో కలిసి దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించడం విశేషం. జూలై 25న ప్రపంచ వ్యాప్తంగా అనేక భారీ చిత్రాల పోటీ మధ్య థియేటర్లకు అనామకంగా, ఎలాంటి అంచనాలు లేకుండా ద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఆప్రతిహాతంగా సుమారు 50 రోజులు థియేటర్లను శాసించింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అంతకు వంద రెట్లు దాదాపు రూ. 350 కోట్లను కొల్లగొట్టి ఉగ్ర తాండవం చేసింది.
అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద స్టోరీనే అయినప్పటికీ నేటి యూత్‌కు సైతం కనెక్ట్ అయ్యేలా పుష్ప సినిమా తరహా బ్యాగ్రౌండ్ మ్యూజిక్, అంతకు మించిన పాటలు, యాక్షన్ సీన్లు, కళ్లు చెదిరే విజువలైజేషన్‌తో మెస్మరైజ్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించింది, అక్కడే పూజలు కూడా చేసి భక్తి తన్మయత్వంలో ముంచేసింది.
అలాంటి ఈ చిత్రం సరిగ్గా పిల్లలకు సెలవులు, బతుకమ్మ, దసరా పండుగల ముందు ఓటీటీకి తీసుకు రావడంతో కుటుంబ ప్రేక్షకులకు ముఖ్యంగా పిల్లల ఆనందానికి పట్టా పగ్గాల్లేకుండా పోయింది. ఈ హాలీడేస్‌కు ఫుల్ టైంఫాస్ ఎన్ని సార్లంటే అన్ని సార్లు ఇంట్లోనే ఎంచక్కా చూడొచ్చనే ఫీల్‌కు వచ్చేశారు.
ఇప్పుడీ సినిమా శుక్రవారం మధ్యాహ్నం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చూసిన వారు, ఇంతవరకు చూడని వారికి ఇదే బెస్ట్ ఛాన్స్. కుటుంబం అంతా కలిసి ఒకటికి రెండు సార్లు ఈ మహావతార్ నరసింహా (Mahavatar Narsimha) చూసి భక్తి పారవశ్యంలో మునిగి తేలండి.