Jio Star: జియోస్టార్.. కంటెంట్ కోసం $10 బిలియన్లు

ABN , Publish Date - May 04 , 2025 | 11:34 AM

వ‌చ్చే మూడు సంవత్సరాలలో కంటెంట్ కోసం జియోస్టార్ $10 బిలియన్లకు పైగా ఖర్చు చేయ‌నున్న‌ట్లు జియోస్టార్ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్ ప్ర‌క‌టించారు.

jio

భారతదేశంలో గత 30 ఏళ్లుగా ముఖ్యంగా ద‌శాబ్ద కాలంగా మీడియా, వినోద రంగంలో వ‌చ్చిన‌, వస్తోన్న మార్పులను అందరం గ‌మ‌నిస్తూనే ఉన్నాం, వాటితో పాటు సాగుతూనే ఉన్నాం. ఈనేప‌థ్యంలో మ‌న దేశాన్నిఅంతర్జాతీయ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES - వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్‌‌ ఘనంగా జరిగింది. జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జియోస్టార్ (Jio Star) వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్ (Uday Shankar), మీడియా పార్టనర్స్ ఆసియా మేనేజింగ్ & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ కౌటో మధ్య ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి.

జియోస్టార్ (Jio Star) వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్ (Uday Shankar) మాట్లాడుతూ..‘గత 25 నుంచి 30 సంవత్సరాలలో భారతీయ మీడియా రంగం గణనీయంగా మార్పులకు లోనైంది. గడిచిన‌ దశాబ్ద కాలంలో జియో రాక‌తో టెలివిజన్, వీడియో వినియోగం రెండింత‌లు పెరిగింది. టెలివిజన్, 4G విప్లవం, హాట్‌స్టార్ వంటి చాలా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ఆవిర్భావంతో జనాల వద్దకు కంటెంట్ మరింత సులభంగా చేరింది. ప్రాంతీయ భాషల్లోనూ ఓటీటీ మార్కెట్ వాడ‌కం గణనీయంగా విస్తరించింది.


WhatsApp Image 2025-05-03 at 8.48.59 PM.jpeg

ప్ర‌స్తుతం సుమారుగా 700 మిలియన్ల మందికి పైగా ఇప్పుడు స్ట్రీమింగ్ కంటెంట్‌తో అటాచ్ అయి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయ‌న్నారు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన కంటెంట్‌ను భారతదేశానికి తీసుకురావడం మంచి పరిణామమ‌ని అదే కోవ‌లో ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర కంటెంట్ రూపొంది ప్రపంచవ్యాప్తంగా ఆక‌ట్టుకునే కంటెంట్ మ‌నం రూపొందించాల్సిన అవసరం ఉంద‌న్నారు. అమెరికా, చైనా దేశాల‌తో పోలిస్తే భారతీయ స్క్రీన్ వినోద పరిశ్రమ ప్రస్తుత $30 బిలియన్ పరిమాణంగా ఉంద‌ని, గత 25, 30 సంవత్సరాలలో $500 మిలియన్ల వరకు పెరగ‌గా, రాబోయే 15 సంవత్సరాల్లో ఇది మరింత మ‌రో స్థాయికి చేరే అవ‌కాశం ఉంద‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే భారతీయ మీడియా, వినోద పరిశ్రమ సంస్థలు ఇప్పటికే గణనీయమైన పెట్టుబడులు పెట్టేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయ‌ని, ఈక్ర‌మంలోనే జియోస్టార్ సైతం కంటెంట్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించి ఖ‌ర్చు పెడుతోందిని, ఈ మేర‌కు 2024లో రూ. 25,000 కోట్లు వెచ్చించ‌గా 2025కి రూ. 30,000 కోట్లు వెచ్చించనున్న‌ట్లు తెలిపారు. ఇక 2026కి రూ. 32,000-33,000 కోట్లకు పైగానే ఖ‌ర్చు పెట్ట‌నుందని సమాచారం. మూడు సంవత్సరాలలో కేవ‌లం కంటెంట్‌పై మీదే జియోస్టార్ (Jio Star) నుంచి $10 బిలియన్లకు పైగా ఖర్చు చేస్తున్నాము" అని అన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:34 AM