Lal Salaam OTT: రజనీకాంత్‌కు నిద్ర కరువు చేసిన సినిమా.. ఎట్టకేలకు ఓటీటీకి లాల్ సలామ్!
ABN , Publish Date - Jun 01 , 2025 | 05:17 PM
జైలర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రజనీకాంత్ కీలక పాత్రలో కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రెండో సారి నటించిన చిత్రం లాల్‌సలామ్ ఎట్టకేలకు ఓటీటీకి ముహూర్తం కుదిరింది.
జైలర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రజనీకాంత్ (Rajinikanth) కీలక పాత్రలో కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో రెండో సారి నటించిన చిత్రం లాల్‌సలామ్ (Lal Salaam). భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్ (Lyca Productions) ఈ చిత్రాన్ని నిర్మించగా విష్ణు విశాల్ (Vishnu Vishal), అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar), ధన్య బాలకృష్ణ, జీవిత రాజశేఖర్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అతిథి పాత్రలో నటించారు. ఆస్కార్ గ్రహీత రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందించారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం రజనీ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కేవలం రూ.20 కోట్ల లోపే వసూళ్లు రాబట్టి సూపర్‌స్టార్‌కు కేరీర్‌లో మాయని మచ్చలా మిగిలింది.
అయితే ఆ వెంటనే నెలలోపే ఓటీటీకి రావాల్సిన ఈ చిత్రానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది. ముందస్తు అగ్రిమెంట్ మేరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మాయం కావడంతో డిజిటల్ స్ట్రీమింగ్ రద్దైంది. దీంతో కాలక్రమంలో అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది అంటూ కాలం వెళ్లదీశారు తప్పితే ఏడాదిన్నర గడిచి పోయి అప్డేట్స్ పూర్తిగా బంద్ అయిపోంతో ఇక సినిమా లేదని అంతా మరిచిపోయారు. ఈ క్రమంలో సడన్‌గా నాలుగు రోజుల క్రితం ఈ చిత్రం హార్డ్ డిస్క్ దొరకడం, వెంటనే స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. జూన్6 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు.
కథ విషయానికి వస్తే.. హిందువులు, ముస్లింలు ఐక్యంగా కలిసి ఉండే కసుమూరు అనే ప్రాంతంలో 1993 సంవత్సరంలో ఆ ఊరిలో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్‌లో మొయిద్దీన్ (రజినీ కాంత్) కొడుకు శంషుద్దీన్ (విక్రాంత్) చేతిని, గురు (విష్ణు విశాల్) నరికేస్తాడు. దీంతో రెండు మతాల మధ్య గొడవలు వస్తాయి. ఈ గొడవలను అదే ప్రాంతం రాజకీయ నాయకులు తమ స్వార్ధానికి ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. అయితే మొయిద్దీన్ (రజినీకాంత్), గురు తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్) ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. గురు తల్లి రాణి (జీవిత), మొయిద్దీన్‌ని అన్న అని పిలుస్తూ ఉంటుంది. అటువంటి తన కొడుకు చేతిని ప్రాణ స్నేహితుడి కుమారుడు నరికేస్తే మొయిద్దీన్ ఏమి చేశాడు? రంజీ క్రికెట్‌కి సెలెక్ట్ అయి చెయ్యి విరగొట్టుకున్న శంషుద్దీన్ ఏమి చేశాడు? అసలు గురు, శంషుద్దీన్ మధ్య గొడవకు కారణం ఏంటి? ఆ ఊర్లో సంవత్సరానికి ఒకసారి జరిగే అమ్మవారి పండగకి రథం కోసం ఏం చేశారు? మొయిద్దీన్ ఈ రెండు కుటుంబాలని ఎలా రక్షించుకున్నాడు, మత సామరస్యాన్ని ఎలా చాటారు అన్నదే ప్రధాన కథ.
అయితే.. సినిమా విడుదలకు ముందు షూటింగ్ దశ నుంచే వివాదాల్లో కూరుకుపోయిన ఈ సినిమాకు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో ఆతర్వాత అవే సమస్యలు ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలోనూ జరిగాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై అరబ్ దేశాలు నిషేధం విధించడం, ఆపై పలు సందర్భాల్లో దర్శకురాలు, నటులు చేసిన ప్రసంగాలు మూవీ విడుదలపై, ఆపై కలెక్షన్లపై భారీగానే ప్రభావం చూపాయి. ఇదిలాఉంటే రజనీ కాంత్ కీలక పాత్ర అని ప్రచారం చేసినా సినిమాలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుంది. అంతేగాక నాటి హీరోయిన్ జీవిత రాజశేఖర్ చాలా కాలం తర్వాత ఓ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఎవరైతే నాడు థియేటర్లలో ఈ లాల్‌సలామ్ (Lal Salaam) సినిమాను చూడడం మిస్ అయ్యిన వారు, రజనీ అభిమానులు ఒక్కసారి ఈ మూవీ చూడవచ్చు. కాగా థియేటర్‌లో రిలీజ్ చేసిన వర్షన్ కన్నా అదనపు నిడివితో ఈ సినిమాను తీసుకురానుండడం గమనార్హం.