Kannappa OTT: మొత్తానికి.. క‌న్న‌ప్ప ఓటీటీకి వ‌చ్చేశాడు

ABN , Publish Date - Sep 04 , 2025 | 06:07 PM

ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూసిన మంచు విష్ణు కన్నప్ప ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Kannappa

తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూసిన మంచు విష్ణు (manchu vishnu) కన్నప్ప (kannappa) ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఈ కథ మనందరికీ తెలిసినదే కానీ, ఈసారి చెప్పిన విధానం కొత్తగా అనిపిస్తుంది. క‌న్నప్ప భ‌క్తుడిగా మారిన థ‌గా కాకుండా పుట్టుక ద‌గ్గ‌రి నుంచి, నాటి త‌రాల‌ను, వ‌ర్గాల‌ను చూపిస్తూ ఓ యోధుడు భ‌క్తుడిగా ఎలా మ‌రాడ‌నే నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు. మోహన్ బాబు (mohanbabu) నిర్మించిన ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.

కోయవాడైన తిన్నడు (మంచు విష్ణు) చిన్ననాటి అనుభవాల వల్ల నాస్తికుడిగా మారతాడు. తన గూడెం కోసం ఎల్ల‌వేళ‌లా ముందు నిలుస్తుంటాడు. అదే సమయంలో అడవిలో ఉన్న శక్తివంతమైన వాయు లింగాన్ని కాపాడే మహదేవశాస్త్రి (మోహన్ బాబు), దానిని దొంగిలించాలని చూసే కాలముఖుడు (అర్పిత్ రాంకా) మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ క్రమంలో తిన్నడు వీరి మ‌ధ్య‌కు ఎలా వ‌చ్చాడు, భ‌క్తి మార్గంలోకి ఎందుకు వెళ్లాడు అందుకు దారి తీసిన ప‌రిస్థితులేంటి ? అతని భార్య నెమలి (ప్రీతి ముకుందన్) కోరిక నెర‌వేరిందా? ఈ ప్రయాణంలో రుద్రుడు (ప్రభాస్) ఎలా భాగమయ్యాడ‌నే? అనేదే అసలు కథ.

Kannappa

స్టిఫెన్ దేవస్సి సంగీతం, షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ, ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు సినిమాకు చాలా బలం చేకూర్చాయి. అయితే గ్రాఫిక్స్ సీన్స్ అంచనాలను అందుకోలేకపోయినా, భారీ ప్రొడక్షన్ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి పాటలు విజువల్స్‌కి బాగా సరిపోయాయి. మూడు గంటల నిడివితో సాగే ఈ ‘కన్నప్ప’ చిత్రంలో భక్తి, వీరత్వం, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిపి ఉన్నాయి.

ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ (OTT)లో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ గురువారం నుంచి స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా చూసే ప్రేక్షకులకు మాత్ర‌మే సినిమా న‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే హీరో, హీరోయ‌న్ల మ‌ధ్య వ‌చ్చే పాట‌లు కాస్త ఇబ్బంది క‌రంగా ఉంటాయి వాటిని స్కిప్ చేయ‌గ‌లిగితే మిన‌హా మూవీని అంతా కుటుంబ స‌మేతంగా వీక్షించ వ‌చ్చు.

Updated Date - Sep 04 , 2025 | 06:07 PM