Splitsville OTT: ఎక్కడ పట్టుకొస్తార్రా.. ఈ కాన్సెప్టులు! ఎటు పోతున్నాంరా మనం
ABN , Publish Date - Sep 24 , 2025 | 07:45 AM
గత నెల చివరలో థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం స్ప్లిట్స్‌విల్లే .
గత నెల చివరలో థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం స్ప్లిట్స్‌విల్లే (Splitsville). మైఖేల్ ఏంజెలో కోవినో రచించి, దర్శకత్వం చేయడంతో పాటు కీలక పాత్రలో నటించి ఓ నిర్మాత గాను వ్యవహరించాడు. ఈ చిత్రంలో హాలీవుడ్ అగ్ర నటీమణి, కుర్రకారు డ్రీమ్ గర్ల్ డకోటా జాన్సన్ (Dakota Johnson) ప్రధాన ఆకర్షణ. అడ్రియా అర్జోనా (Adria Arjona), మైఖేల్ ఏంజెలో కోవినో (Michael Angelo Covino), కైల్ మార్విన్ (Kyle Marvin) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడీ సినిమా చడీ చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మనం ఇప్పటివరకు భార్య భర్తల నడుమ రిలేషన్స్ విషయంలో వింటూ వచ్చిన వాటిని మించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది. కొత్తగా ఓపెన్ రిలేషన్ షిప్ (పెళ్లి చేసుకున్న జంటలు తమకు నచ్చిన ఇతరులతోనూ గడపొచ్చు, ఎలాంటి సంబంధాలైనా పెట్టుకోవచ్చు) నేపథ్యంలో సినిమా ఉంటుంది.
కథ విషయానికి వస్తే.. క్యారీ – ఆష్లీ అనే దంపతులు ఓ హైవే మీద కారులో ప్రయాణిస్తుండగా మరో జంట రోడ్డు ప్రమాదానికి గురవడం చూస్తారు. వారిని సాయపడేందుకు ప్రయత్నం చేసినా కుదరదు. ఆ ఘటనతో షాక్ అయిన ఆష్లీ తనకు విడాకులు కావాలనిపిస్తోందని నేను నీకు ద్రోహం చేసానని నాకు మరొకరితో సంబంధం ఉందని క్యారీకి చెబుతుంది.
దీంతో.. ఆ బాధను తట్టుకోలేకపోయిన క్యారీ తన స్నేహితుడు పాల్ దగ్గరికి వెళ్లగా అప్పటికే పాల్ జూలీతో ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలుస్తుంది. క్రమంగా క్యారీ జూలీకి దగ్గరై ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. ఈ విషయం తెలిసిన పాల్–క్యారీ మధ్య గోడవలు వస్తాయి. మరోవైపు క్యారీ భార్య ఆష్లీ కూడా అనేక మందితో సంబంధాలు మెయింటెన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో పాల్ ఆర్థికంగా దివాళా తీయడం, జూలీతో విడాకులు తీసుకోవడం, తిరిగి జూలీతో శారీరక సంబంధం కొనసాగించడం వంటి పరిణామాలు వారి కుటుంబాల్లో మరింత గందరగోళానికి దారి తీస్తాయి.
చివరకు ఎవరు ఎటు వెళ్లారు, తిరిగి ఆష్లీ–క్యారీ కలిశారా, పాల్–జూలీ జంట ఏమైంది అనే మన భారతీయులకు అసలు అర్థం కానీ టచ్ చేసేందుకు సైతం ధైర్యం చేయ లేని కథ కథనంతో సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తుంది. ఎవరు ఎవరితో ఉంటారు, ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారనే అంశాలు అర్థం కాక వీక్షకులు పిచ్చోళ్లు అయిపోతారు. ఇలాంటి సినిమాలు చూస్తే మాత్రం మనకు మన జీవితాలపై, పెళ్లిళ్లపై విరక్తి రావడం మాత్రం ఖాయం. ప్రస్తుతం ఈ చిత్రం భారత్ మినహా ఇతర దేశాల్లో ప్రైమ్ వీడియో (Primevideo Rent) ఓటీటీలో రెంట్ అపద్దతిలో అందుబాటులోకి వచ్చింది.
ఇలాంటి కళాకండాలను పెద్దవాళ్లైనా చూడడం చాలా కష్టం. వీటిని చూశాక ఎటు పోతున్నాం రా మనం అనిపించక మానదు. ఇప్పటికే డేటింగ్, స్వాప్, బెంచ్ అంటూ రకరకాల సంబంధాలను పట్టుకొచ్చిన హాలీవుడ్ ఇప్పుడు అంతకుమించి అనేలా ఈ తరహా మూవీని తీసుకు వచ్చింది. ఇంకా చెప్పాలంటే నేటి యూత్‌కు పరియం చేసింది.. పైపెచ్చు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ డకోటా జాన్సన్ సహా మిగతా ఇద్దరు ప్రధాన పాత్ర దారులు ఈ సినిమా నిర్మాతలే కావడం దౌర్భాగ్యం.