Ufff Yeh Siyapaa OTT: ఓటీటీలో .. తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ సైలెంట్ మూవీ! పిల్ల జమిందార్, భాగమతి తర్వాత
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:41 AM
పిల్ల జమిందార్, సుకుమారుడు, భాగమతి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జీ అశోక్ కాస్త విరామం తర్వాత బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం ఉఫ్ఫ్ యే సియాపా.
తెలుగులో పిల్ల జమిందార్, సుకుమారుడు, భాగమతి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్ దర్శకుడు జీ అశోక్ (G.Ashok). ఆయన కాస్త విరామం తర్వాత బాలీవుడ్‌లో రూపొందించిన చిత్రం ఉఫ్ఫ్ యే సియాపా (Ufff Yeh Siyapaa). అయితే ఇది పూర్తిగా ఔట్ అండ్ ఔట్ సైలెంట్ సినిమా అవడం విశేషం. ఎక్కడా ఎలాంటి మాట అనేదే లేకుండా పూర్తిగా సంగీత ప్రధానంగా మూవీ సాగుతుంది.
అలాంటి ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సెప్టెంబర్ 5న దేశ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఫర్వాలేదనే టాక్ సంపాదించుకుంది. ఇదిలాఉంటే.. సోహమ్ షా (Sohum Shah), నుష్రత్ భరుచా (Nushrratt Bharuccha), నోరా ఫతేహి (Nora Fatehi), ఓంకార్ కపూర్ కీలక పాత్రల్లో నటించగా అస్కార్ విన్నర్ రెహామాన్ (A.R. Rahman) సంగీతం అందించడం గమనార్హం.
కథ విషయానికి వస్తే.. అమాయకుడైన కేసరి లాల్ సింగ్ (సోహమ్ షా), భార్య పుష్ప (నుష్రత్ భరుచా)తో హాయిగా లైఫ్ వెళ్లదీస్తుంటాడు. అయితే ఓ రోజు తన భర్త కేసరి పొరుగింటి కామిని (నోరా ఫతేహి)తో ఏదో సంబంధం ఉందని అనుమానించి వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సమయంలో కేసరి ఇంటికి తప్పుగా వచ్చిన డ్రగ్స్ పార్శిల్ కోసం ఇద్దరు అగంతకులు దొంగచాటుగా ఆ ఇంటికి వస్తారు. ఈ విషయం తెలియని కేసరి అనుకోకుండా చేసిన పని వళ్ల తనకు తెలియకుండానే ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతారు. తర్వాత విషయం తెలిసి షాకైన కేసరి ఆ శవాన్ని బయట పడేసి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో మరో మృతదేహం కనిపిస్తుంది.
సరిగ్గా.. అదే సమయంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ హస్ముఖ్ (ఓంకార్ కపూర్) రంగంలోకి దిగుతాడు. దీంతో పరిస్థితి విషమంగా మారుతుంది. కేసరిని టార్గెట్ చేయడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలోకి వెల్లి పోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో హీరో ఆ సమస్య నుంచి ఎలా బయట పడ్డాడు, అ ఇంట్లోకి వచ్చిన వారు ఎలా చనిపోయారనే ఆసక్తికరమైన కథకథనాలతో మంచి థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తూ, కడుపుబ్బా నవ్విస్తూ సినిమా సాగుతుంది.
కేవలం నటీనటుల పెర్ఫార్మెన్స్, సస్పెన్స్, కామెడీ, మలుపులతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. సినిమా చూసే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి అందిస్తుంది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఎలాగో డైలాగ్స్ లేవు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా చూసి ఆస్వాధించవచ్చు. కాకపోతే కాస్త డార్క్ టోన్‌లో సినిమా సాగుతుంది.