Netflix: ఓటీటీ నుండి.. 'బాహుబలి' అవుట్

ABN , Publish Date - Oct 04 , 2025 | 06:34 PM

'బాహుబలి' రెండు భాగాలు కొంత కాలం వరకూ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడవి లేవు. అక్టోబర్ 31న రాబోతున్న 'బాహుబలి: ది ఎపిక్'కు క్రేజ్ రావడం కోసం వీటిని ఓటీటీ నుండి తొలగించారని తెలుస్తోంది.

Netfilx - Baahubali

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రాలలో 'బాహుబలి' సినిమాలకు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు. 'ట్రిపుల్ ఆర్' తరహాలో ఈ సినిమా ఆస్కార్ ను గెలుచుకోకపోయినా... అంతర్జాతీయ స్థాయిలో 'ట్రిపుల్ ఆర్'ను మించిన వసూళ్ళను 'బాహుబలి' రెండోభాగం దక్కించుకుంది. అంతేకాదు... భారతీయ సినిమా రంగంలోనే 'బాహుబలి'కి ముందు 'బాహుబలి'కి తర్వాత అని ట్రేడ్ వర్గాలు ఒక లైన్ ను గీశాయి.


తాను తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా తొలి భాగం పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమౌళి ఇప్పుడు 'బాహుబలి' రెండు చిత్రాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకటిగా అక్టోబర్ 31న విడుదల చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా 'బాహుబలి' సినిమాను చూడాలని అనుకున్నవారు ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో దీనిని చూసి ఆనందిస్తున్నారు. అయితే... ఇటీవల ఈ రెండు సినిమాలను నెట్ ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ జాబితా నుండి తొలగించిందని తెలుస్తోంది. ఈ సినిమాను చూద్దామని సెర్చ్ చేసిన వారికి కనిపించకుండా పోయిందని వాపోతున్నారు. అయితే... నెట్ ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇలా జరిగిందేమో అని కొందరు అనుకుంటున్నారు. కానీ 'బాహుబలి: ది ఎపిక్' మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో 'బాహుబలి' రెండు చిత్రాలను ఓటీటీ నుండి తొలగిస్తే... మంచిదని మేకర్స్ భావించారని తెలుస్తోంది. అందుకే రాజమౌళి బృందం కోరిక మేరకు నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాలను తొలగించిందని అంటున్నారు. బహుశా 'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీ హక్కుల్ని కూడా అర్కా మీడియా అధినేతలు నెట్ ఫ్లిక్స్ కే ఇచ్చి ఉంటారు. ఆ సినిమాకు క్రేజ్ రావడం కోసం పాత వాటిని తొలగించారని తెలుస్తోంది.

Updated Date - Oct 04 , 2025 | 07:27 PM