My Baby OTT: నిన్న థియేటర్‌లో రిలీజ్.. ఇవ్వాళ ఓటీటీలో
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:57 AM
ఫస్ట్ టైం ఓటీటీలో వింత పరిస్థితి ఎదురైంది. ఓ చిత్రం నిన్న థియేటర్‌లో రిలీజ్ అయి ఇవ్వాళ ఓటీటీలోకి వచ్చేసింది.
ఫస్ట్ టైం ఓటీటీలో వింత పరిస్థితి ఎదురైంది. గత నెల జూన్ 20న తమిళనాట విడుదలై మంచి విజయం సాధించిన ‘డీఎన్‌ఏ’ (DNA) చిత్రం తెలుగులో మై బేబీ (My Baby) పేరుతో అనువాదమై నిన్ననే (శుక్రవారం, జూలై 18న) రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన సినిమా ఇవ్వాళే (శనివారం) తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది. దీంతో ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడి నిర్మాతలకు ఎదురైంది. అధర్వ మురళి (Atharvaa murali) నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటించగా, నెల్సన్ వెంకటేశన్ (Nelson Venkatesan) దర్శకత్వం వహించాడు.
2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.కథ విషయానికి వస్తే.. లవ్ ఫెయిల్యూర్ అయిన ఆనంద్ తాగుబోతుగా మారతాడు. ఆపై కొన్ని రోజుల తర్వాత బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న దివ్యని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేస్తాడు. అయితే దివ్య డెలీవరీ సమయంలో జరిగిన ఓ ఘటనతో కథ మలుపు తిరుగుతుంది. ఆస్పత్రిలో డెలివరీ జరిగిన తర్వాత దివ్య ఆ బిడ్డ తన బిడ్డ కాదని మార్చారంటూ అక్కడి వారిని నిలదీస్తుంది. కానీ ఆమె మాటలను ఎవరూ నమ్మక పోగా ఆమె ప్రవర్తనపై అనుమానాలు వస్తాయి. కానీ ఆనంద్ ఒక్కడే భార్య దివ్యకు మద్దతుగా రంగంలోకి దిగడంతో అనేక కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి.
ఈ క్రమంలో దివ్య చెప్పినట్టు ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డను నిజంగా మార్చారా, ఇతరులకు ఇలాంటి ఈ ఘటన ఇంకెవరికైనా జరిగిందా, దీని వెనకాల ఉన్న రహాస్యం ఏంటి, తమ నిజమైన బిడ్డ దొరికిందా లేదా చివరకు ఆనంద్ ఏం చేశాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. కాగా ఇప్పుడీ సినిమా ఈరోజు నుంచి (శనివారం, జూలై 19) నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారు ఈ మై బేబీ (My Baby) చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సవ్వొద్దు.
ఇదిలాఉంటే.. తమిళంలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమాను మై బేబీ (My Baby) పేరుతో తెలుగులో జూలై11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అఖరి నిమిషంలో సెన్సార్ కాకపోవడంతో సినిమా రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేసి జూలై 18న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు. అయితే నిర్మాతలతో జియో హాట్‌స్టార్ ముందస్తుగా చేసుకున్న ఒప్పందం మేరకు జూలై18న ఓటీటీకి తీసుకు రావాల్సి ఉండగా తెలుగులో థియేటర్లలో విడుదల నేపథ్యంలో కేవలం ఒక్కరోజు మాత్రం వాయిదా వేసి శనివారం (జూలై 19న) తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభించారు.శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది.