DNA OTT: అదిరిపోయే.. థ్రిల్లర్ ఓటీటీకి వచ్చేస్తోంది
ABN , Publish Date - Jul 14 , 2025 | 05:51 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ ఢిపరెంట్ థ్రిల్లర్ మూవీ సిద్ధం అవుతోంది.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఓ ఢిపరెంట్ థ్రిల్లర్ మూవీ సిద్ధం అవుతోంది. గత నెల జూన్ 20న తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘డీఎన్‌ఏ’ (DNA). అధర్వ మురళి (Atharvaa murali) నిమిషా సజయన్ (Nimisha Sajayan) జంటగా నటించగా, ప్రముఖ దర్శకుడు బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్ కీలక పాత్రలు పోషించారు. గతంలో ‘ఫర్హానా’, ‘మాన్‌స్టర్’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను రూపొందించిన నెల్సన్ వెంకటేశన్ (Nelson Venkatesan) దర్శకత్వం వహించాడు. ఒలింపియా మూవీస్ (Olympia Movies) బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అంబేత్ కుమార్ (Ambeth Kumar) నిర్మించారు. అయితే.. 2014లో ఒక సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. ఆనంద్ లవ్ ఫెయిల్యూర్ అయి తాగుబోతుగా మారతాడు. అదే సమయంలో బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఇష్యూ ఉన్న దివ్య అనే యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెడతాడు. ఆపై చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆ జంట హ్యాపీగా ఉంటారు. అయితే దివ్య డెలీవరీ సమయంలో జరిగిన ఓ ఘటనతో పరిస్థితి అంతా తారుమారవుతుంది. అందుకు కారణం ఆస్పత్రిలో డెలివరీ జరిగిన కాసేపటికే దివ్య ఆ బిడ్డ తన బిడ్డ కాదని ఎవరో మార్చారంటూ డాక్టర్లను నిలదీస్తుంది. కానీ ఆమె మాటలను ఎవరూ నమ్మరు. అక్కడ అనేక మంది గర్బిణులు ఉన్నా ఎలాంటి ఫిర్యాదు లేకపోగా దివ్య మాత్రమే క్వశ్చన్ చేయడంతో ఆమె ప్రవర్తనపై అనుమానాలు వస్తాయి. ఈ నేపథ్యంలో హీరో ఆనంద్ సైతం తీసుకున్న నిర్ణయంతో అనేక కోణాలు బయట పడుతూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
ఈ క్రమంలో దివ్య వాదన కరెక్టేనా, ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డ నిజంగా మారిందా, కేవలం దివ్యకు మాత్రమే ఈ ఘటన ఎదురైందా లేక హస్పిటల్‌లోని వారెవరికైనా జరిగిందా, దీని వెనకాల ఉన్న రహాస్యం ఏంటి, తమ నిజమైన బిడ్డ దొరికిందా లేదా చివరకు ఆనంద్ ఏం చేశాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతూ చూసే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. కాగా ఇప్పుడీ సినిమా జూలై 25 నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. మంచి ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ తరహా సినిమాలు ఇష్టపడే వారు ఈ మై బేబీ (My Baby) చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సవ్వకుండా చూసి తీరాల్సిందే.
ఇదిలాఉంటే.. తమిళంలో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ సినిమాను మై బేబీ (My Baby) పేరుతో తెలుగులో జూలై11న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అఖరి నిమిషంలో సెన్సార్ కాకపోవడంతో సినిమా రిలీజ్‌ను వారం రోజులు వాయిదా వేసి జూలై 18న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా థియేటర్లకు వచ్చాక మరుసటి వారమే ఓటీటీల్లోకి వస్తుండడం విడ్డూరం. మరోవైపు సాధారణంగా ఒక చిత్రానికి ఒక సంగీత దర్శకుడు పనిచేస్తుంటారు. కానీ, ఈ సినిమాకు మాత్రం ఏకంగా సత్యప్రకాష్ (Sathya prakash), శ్రీకాంత్ హరిహరన్ (D Sreekanth Hariharan), ప్రవీణ్ షైవి ( Pravin Saivi), సహి శివ (Sahi Siva), అనల్ ఆకాష్ (Anal Akash) అనే ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం గమనార్హం. చిత్రంలోని ఐదు పాటల్లో ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకుడు చొప్పున మొత్తం ఐదుగురు సంగీత దర్శకులు సంగీత బాణీలను సమకూర్చారు.