OTT: ఆరేండ్ల తర్వాత తెలుగులో.. ఓటీటీకి వచ్చిన దుల్కర్ సల్మాన్ కామెడీ థ్రిల్లర్
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:22 AM
తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు దుల్కర్ సల్మాన్ నటించిన ఓ మలయాళ కామెడీ, థ్రిల్లర్ చిత్రం ఆరేండ్ల తర్వాత ఓటీటీకి వచ్చేసింది.
తెలుగు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో మలయాళ కామెడీ, థ్రిల్లర్ వచ్చేసింది. 2019లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చి మిశ్రమ స్పందనను తెచ్చుకున్న ఓరు యమండన్ ప్రేమకద (Oru Yamandan Premakadha) సినిమాను ఇప్పుడు ఒక యముడి ప్రేమ కథ (Oka Yamudi Prema Katha) పేరుతో తెలుగులోకి అనువాదం చేసి తీసుకు వచ్చారు. సంయుక్త మీనన్ (Samyuktha Menon), నిఖిలా విమల్ (Nikhila Vimal) కథానాయికలుగా నటించగా షౌబిన్ సాహీర్ (Soubin Shahir), సలీం కుమార్ (Salim Kumar), విష్ణు ఉన్ని కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. జాన్ (లల్లు) పెయింటర్‌గా పని చేస్తూ చూడగానే స్పార్క్ వచ్చిన అమ్మాయినే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో పేపర్‌లో దియా (నిఖితా విమల్) అనే అమ్మాయి ఫొటో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె కోసం తెగ వెతికినా అచూకీ దొరకదు. కొన్ని రోజులకు దియాని ఎవరో హత్య చేశారని తెలుస్తుంది. దీంతో లల్లూ అ హంతకుడిని కనిపెట్టి రివేంజ్ తీసుకొవాలని అనుకుంటాడు. ఈ నేపథ్యంలో హీరో హంతకుడిని పట్టుకున్నాడా, ఎందుకు హత్య చేశారు, జెష్ణ (సంయుక్త) పాత్ర ఏంటి అనే కథనంతో సినిమా సాగుతుంది.
దుల్కర్ కెరీర్ తొలి నాళ్లలో నటించిన ఈ చిత్రం కేరళలో పర్వాలేదనిపించింది. ఆపై తెలుగులో మహానటి, సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తో స్టార్‌గా ఎదిగిన ఆయన కేరళను మించి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.ఈ నేపథ్యంలో ఆయన పాత సినిమాలను తెలుగులో తీసుకు వస్తు్నన క్రమంలో ఈ సినిమాను ఓటీటీకి తీసుకు వచ్చారు. ఈ సినిమాను ఆ సమయంలోనే థియేటర్లకు తీసుకు రావాలని తెలుగు ట్రైలర్ విడుదల చేవారు కానీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఈ ఒక యముడి ప్రేమ కథ (Oka Yamudi Prema Katha) సినిమాను ఆహా (AHA) వేదికగా ఓటీటీకి తీసుకు వచ్చారు. దుల్కర్ ఫ్యాన్స్, మలయాళ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను కుటుంబంతో కలిసి ఎంచక్కా చూసేయవచ్చు.