Vijaya Lalitha: యాక్షన్ క్వీన్ అంటే... విజయలలిత

ABN , Publish Date - Jun 17 , 2025 | 06:08 PM

'రౌడీ రాణి'లో టైటిల్ రోల్ పోషించిన విజయలలిత, 'కోడలు దిద్దిన కాపురం'లో వ్యాంప్ రోల్ లో కనిపించారు. విజయవాడలో యన్టీఆర్ నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి జనం భారీ పూలమాలలు వేసి, క్షీరాభిషేకాలు చేశారు.

Action Queen Vijaya Lalitha

ఎదురుగా నటరత్న యన్టీఆర్ 200వ చిత్రం 'కోడలు దిద్దిన కాపురం' (Kodalu Diddina Kapuram) విడుదలవుతోంది. 1970 అక్టోబర్ 21న 'కోడలు దిద్దిన కాపురం' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. అదే సమయంలో యాక్షన్ క్వీన్ విజయలలిత నటించిన 'రౌడీ రాణి' (Rowdy Rani) చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాత ఎ.పూర్ణచంద్రరావు డిసైడ్ అయ్యారు. నిజానికి యన్టీఆర్ సినిమా రోజునే రిలీజ్ చేయాలన్నది పూర్ణచంద్రరావు ప్లాన్. అయితే రామారావు తన సెంటిమెంట్ డేట్ గా అక్టోబర్ 21న బుధవారం వచ్చినా తన 200వ చిత్రం 'కోడలు దిద్దిన కాపురం' విడుదల చేయాలని నిర్ణయించారు. తరువాత రెండు రోజులకు అక్టోబర్ 23న పూర్ణచంద్రరావు తన 'రౌడీ రాణి' విడుదల చేశారు. విశేషమేంటంటే 'రౌడీ రాణి'లో టైటిల్ రోల్ పోషించిన విజయలలిత, 'కోడలు దిద్దిన కాపురం'లో వ్యాంప్ రోల్ లో కనిపించారు. విజయవాడలో యన్టీఆర్ నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి జనం భారీ పూలమాలలు వేసి, క్షీరాభిషేకాలు చేశారు. 'రౌడీ రాణి'కి కూడా అదే ఎత్తులో విజయలలిత కటౌట్ ఏర్పాటు చేయడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. యన్టీఆర్ ప్రిస్టేజియస్ మూవీ ముందు 'రౌడీ రాణి' నిలదొక్కుకోదనే అందరూ భావించారు. అయితే 'రౌడీ రాణి' సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకు కారణం ఆ చిత్రంలో విజయలలిత చేసిన ఫైట్స్ అని చెప్పక తప్పదు. అలా అప్పట్లో యాక్షన్ క్వీన్ గా జేజేలు అందుకున్న విజయలలిత ఎక్కువగా ఐటమ్ గాళ్ గానే కనిపించడం గమనార్హం!


విజయలలిత 1949 జూన్ 17న తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జన్మించారు. బాల్యంలోనే సంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందారు. అప్పట్లో పేరుమోసిన నర్తకి కుచల కుమారి డాన్సులు చూసి విజయలలిత కూడా ఆ తీరున తన నృత్యంతో మురిపించేవారు. అలా విజయలలిత డాన్స్ చూసిన వారు 'సినిమాల్లో చేరొచ్చు కదా...' అంటూ ఉండేవారు. చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహంతోనూ, తన అక్క సహకారంతోనూ విజయలలిత మద్రాసు చేరారు. ఆమె నృత్యం చూసిన దోనేపూడి కృష్ణమూర్తి అనే నిర్మాత చిత్రసీమకు పరిచయం చేశారు. డాన్సుల్లో విజయలలిత స్పీడు చూసిన సినీజనం మొదట్లో ఆమెలోని నర్తకికే జై కొట్టారు. అలా పలు చిత్రాల్లో ఐటమ్ గాళ్ గా సాగారు విజయలలిత. కొన్ని చిత్రాల్లో కేరెక్టర్ యాక్టర్ గానూ, వ్యాంప్ గానూ మురిపించారామె. నటరత్న యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలలో విజయలలితకు కీలక పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. జానపద, పౌరాణికాల్లోనూ విజయలలిత తనదైన బాణీ పలికించారు. అప్పటికే నర్తకిగా ఎల్.విజయలక్ష్మి ఎంతో పేరు గడించారు. ఆమె కంటే స్పీడుగా డాన్స్ చేస్తూ మురిపించారు విజయలలిత. కొన్ని చిత్రాల్లో నాయికగానూ నటించారామె. యన్టీఆర్ జోడీగా ఆయన సొంత చిత్రం 'వేములవాడ భీమకవి'లో నటించారు విజయలలిత. ఇక కృష్ణ సరసన జోడీగా 'చలాకీ రాణి - కిలాడీ రాజా'లో కనిపించారు. అనేక సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ లోనూ విజయలలిత అలరించారు.

మాతృభాష తెలుగులోనే కాదు దక్షిణాది అన్ని భాషల్లోనూ విజయలలిత నటించి ఆకట్టుకున్నారు. హిందీలో "సాధు ఔర్ సైతాన్, రాణీ మేరా నామ్, లోక్ పరలోక్, హత్ కడీ" వంటి చిత్రాల్లో నటించారు విజయలలిత. ఆమె అక్క కూతురే లేడీ సూపర్ స్టార్ గా రాణించిన విజయశాంతి. ఆ నాటి అభిమానులు ఈ నాటికీ విజయలలిత డాన్స్ ను, యాక్షన్ సీన్స్ ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

Updated Date - Jun 17 , 2025 | 06:58 PM