Photo Talk: అభినయ రత్నాలు!

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:05 PM

ఒకరు నటరత్న- మరొకరు నటచక్రవర్తి - వీరిద్దరూ కలసి పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో విజయదుందుభి మోగించిన వైనాన్ని తెలుగుజనం ఈ నాటికీ స్మరిస్తూనే ఉన్నారు. నటరత్న యన్టీఆర్ కంటే నటచక్రవర్తి యస్వీఆర్ వయసులో ఐదేళ్ళు పెద్ద.

ఒకరు నటరత్న- మరొకరు నటచక్రవర్తి - వీరిద్దరూ కలసి పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో విజయదుందుభి మోగించిన వైనాన్ని తెలుగుజనం ఈ నాటికీ స్మరిస్తూనే ఉన్నారు. నటరత్న యన్టీఆర్ (NTR) కంటే నటచక్రవర్తి యస్వీఆర్ (SVR) వయసులో ఐదేళ్ళు పెద్ద. అయినా వారిద్దరి మధ్య ఎంతో స్నేహబంధం ఉండేది. యన్టీఆర్ కంటే ముందే 'వరూధిని'లో ప్రవరాఖ్యుని పాత్ర పోషించి, ఆ సినిమా పరాజయంతో కొన్నాళ్ళు సినిమా రంగానికి దూరంగా ఉన్నారు యస్వీఆర్. తరువాత యన్టీఆర్ తొలి చిత్రం 'మనదేశం'లో ఓ చిన్న వేషం వేశారు యస్వీఆర్. ఆ పై యన్టీఆర్ హీరోగా విడుదలైన తొలి చిత్రం 'షావుకారు'లో సున్నం రంగడిగా నటించి మంచి మార్కులు సంపాదించారు యస్వీఆర్. అటు తరువాత యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన 'పాతాళభైరవి'లోనూ నేపాల మాంత్రికునిగా భూపాలం అదిరేలా అభినయించి ఆకట్టుకున్నారు రంగారావు. అలా రామారావు - రంగారావు అభినయ యాత్ర భలేగా సాగింది. అనేక చిత్రాలలో ఢీ అంటే ఢీ అని నటించి వీరిద్దరూ జనం మదిని గెలిచారు.

కొన్ని చిత్రాల్లో తండ్రీకొడుకులుగా, మరికొన్నిట మామా అల్లుళ్ళుగా, అన్నదమ్ములుగా, బావ-బావమరిదిగా, బాబాయ్-అబ్బాయ్ గా ఇలా పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాల్లో అలరించారు రామారావు-రంగారావు. యన్టీఆర్ స్టార్ హీరోగా సాగితే, యస్వీఆర్ స్టార్ కేరెక్టర్ యాక్టర్ అనిపించుకున్నారు. యన్టీఆర్ సొంత చిత్రాలు "జయసింహ, రేచుక్క-పగటిచుక్క, శ్రీకృష్ణసత్య'లో యస్వీఆర్ అభినయించగా, యస్వీఆర్ నిర్మాణ భాగస్వామిగా రూపొందిన 'నాదీ ఆడజన్మే'లో యన్టీఆర్ హీరోగా నటించారు. మధ్యలో వారి మధ్య మనస్పర్థలు తలెత్తినా, అవి టీ కప్పులో తుఫానులా సమసిపోయాయి. ఆ తరువాత వారిద్దరూ నటించిన కొన్ని చిత్రాలు అలరించాయి. యన్టీఆర్ తో యస్వీఆర్ చివరగా నటించిన చిత్రం 'పల్లెటూరి చిన్నోడు'. ఇందులో వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు.

ఇక్కడ మనం చూస్తున్న ఛాయాచిత్రం ఓ కార్యక్రమంలో యన్టీఆర్, యస్వీఆర్ పాల్గొన్నారు. రామారావు మేకప్ తోనే షూటింగ్ నుండి వచ్చి పాలు పంచుకున్నారు. వీరిద్దరి మధ్య వెనకాల కనిపిస్తున్నవారు ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్ జైహింద్ సత్యం. ఏది ఏమైనా ఈ స్టిల్ యన్టీఆర్, యస్వీఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆ నాటి వారి చిత్రాలను గుర్తుకు తెస్తోంది.

Updated Date - Jul 27 , 2025 | 05:06 PM