Dr Chakravarthy: పాత్రలే కనిపించేలా సాగిన నటన...
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:00 PM
మహానటి అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు సావిత్రి. ఆమె చెంతనే ఇన్ స్పెక్టర్ గా కనిపిస్తున్న గుమ్మడి వెంకటేశ్వరరావు సైతం మహానటుల జాబితాలో తన పేరు పదిలం చేసుకున్నవారే.
మహానటి అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్నారు సావిత్రి (Savitri) . ఆమె చెంతనే ఇన్ స్పెక్టర్ గా కనిపిస్తున్న గుమ్మడి వెంకటేశ్వరరావు సైతం మహానటుల జాబితాలో తన పేరు పదిలం చేసుకున్నవారే. సావిత్రి, గుమ్మడి కలసి అనేక చిత్రాలలో పలు పాత్రలకు ప్రాణం పోశారు. వారిద్దరూ తమ పాత్రలు కనిపించేలా చేసేవారే కానీ, ఏనాడూ వాటిని అధిగమించి నటించలేదు. ఇక్కడ చూస్తున్న ఛాయాచిత్రం 'డాక్టర్ చక్రవర్తి' (Dr chakravarthy) సినిమాలోనిది. ఈ చిత్రంలో గుమ్మడి, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించారు. ఇందులో ఏయన్నార్ హీరో. జగ్గయ్య సైడ్ హీరో. ఈ చిత్రంలో జగ్గయ్య భార్య పాత్రలో సావిత్రి అభినయించారు. ఆమెతో ఏయన్నార్ చనువుగా ఉన్నారని, అనుమానించిన జగ్గయ్య ఏదో నెపంతో భార్యను పుట్టింటికి పంపిస్తాడు.
అసలు విషయం తెలుసుకున్న అన్న గుమ్మడి అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. అయినా తన కాపురం గురించి, భర్త పరువు గురించి యోచించే ఇల్లాలుగా సావిత్రి కనబరచిన అభినయం సినిమాకు ఓ ప్రధానాకర్షణగా నిలచింది. గుమ్మడి పాత్ర నిడివి ఇందులో చాలా తక్కువే అయినా కనిపించిన కొన్ని సీన్స్ లోనూ తనదైన బాణీ పలికించారు. గుమ్మడి, సావిత్రి ఇద్దరూ తాము కనిపించకుండా వారు ధరించిన పాత్రలతోనే అలరిస్తారని ప్రతీతి. అందుకు 'డాక్టర్ చక్రవర్తి' కూడా ఓ ఉదాహరణ అని చెప్పొచ్చు.