N T Ramarao: తొలి పౌరాణిక చిత్రం 'మాయా రంభ'కు 75 యేళ్ళు

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:34 PM

నందమూరి తారకరామారావు నటించిన తొలి పౌరాణిక చిత్రం 'మాయా రంభ'. అందులో ఆయన కుబేరుని కుమారుడైన నలకూబరునిగా నటించారు. ఆ సినిమా విడుదలై నేటికి 75 సంవత్సరాలైంది.

NTR Mayaa Rambha Movie

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా జేజేలు అందుకున్న నటరత్న యన్.టి.రామారావు (NT Ramarao) పేరు వినగానే ఆయన ధరించిన పౌరాణిక పాత్రలే ముందుగా గుర్తుకు వస్తాయి. దాదాపు 42 పౌరాణిక చిత్రాలలో యన్టీఆర్ (NTR) పలు విభిన్నమైన పాత్రలు ధరించి అలరించారు. అది ప్రపంచ రికార్డ్! అంతటి ఘన చరితను సొంతం చేసుకున్న నటరత్న నటించిన తొలి పౌరాణిక చిత్రం ఏదంటే ఇప్పటికీ ఏదని తడుముకొనేవారు ఉన్నారు... ఆ సినిమా 'మాయారంభ' (Maya Rambha). యన్టీఆర్ నటించిన నాల్గవ చిత్రం. 1950 సెప్టెంబర్ 22న విడుదలైన 'మాయారంభ'లో యన్టీఆర్ కుబేరుని కుమారుడైన నలకూబరునిగా నటించారు. ఈ చిత్రానికి టి.పి. సుందరం (T P Sundaram) దర్శకత్వం వహించారు. ఆయనే నిర్మాత కూడా. అలా యన్టీఆర్ లో పౌరాణికాలకు సరిపోయే ఫీచర్స్ ఉన్నాయని గుర్తించిన తొలి దర్శకునిగా టి.పి.సుందరం నిలచి పోయారు.


మరి 'మాయారంభ' ఎలా సాగింది అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఇందులో రంభగా జి.వరలక్ష్మి (G Varalakshmi), కళావతిగా అంజలీదేవి (Anjali Devi) నటించారు. రంభ ప్రియుడు నలకూబరునిగానే యన్టీఆర్ అభినయించారు. నారద పాత్రలో సి.యస్.ఆర్. ఆంజనేయులు కనిపించారు. శ్రీకృష్ణ పాత్రలో కె.వి.శ్రీనివాస్, కాపాలిక పాత్రలో బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఉద్ధండునిగా కస్తూరి శివరావ్ నటించారు. ఈ సినిమాలో యన్టీఆర్, అంజలీదేవి అభినయాన్ని ఆ నాటి పత్రికలు ప్రశంసించాయి. కాగా, జి.వరలక్ష్మి అందాన్ని అభినందిస్తూనే సినిమాలోని సాంకేతిక లోపాలను ఎత్తి చూపాయి. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రలు ధరించిన నటునిగా నిలచిన యన్టీఆర్ తొలి పౌరాణిక చిత్రం అంతగా అలరించలేక పోయిందన్నది వాస్తవం!

'మాయారంభ' చిత్రాన్ని దర్శకనిర్మాత సుందరం తరువాత తమిళంలో అనువదించారు. చిత్రంగా తమిళ జనాన్ని 'మాయారంభ' ఆకట్టుకుంది. దాంతో సుందరం నష్టాలపాలు కాకుండా బయట పడ్డారు. ఈ చిత్రకథను బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసినా, పింగళి సూరన విరచితమైన 'కళాపూర్ణోదయం' (Kalaa Poornodayam) కావ్యం అసలైన ఆధారం. సూరన సైతం పురాణాల్లోని పలు కథలను ఒక్కటిగా చేసి 'కళాపూర్ణోదయం' రచించడం విశేషం! అన్నట్టు రామారావు కాలేజీ రోజుల్లో వారికి 'కళాపూర్ణోదయం' పాఠ్యాంశంగా ఉండేది. అందులోని పద్యాలు సైతం యన్టీఆర్ కు కంఠస్థంగా ఉండేవి. అంతలా ఆకట్టుకున్న కథలోనే యన్టీఆర్ కీలకమైన నలకూబరుని పాత్రను ధరించడం విశేషం!

Also Read: Mohan Lal: పూజా కార్యక్రమాలతో మొదలైన 'దృశ్యం -3'

Also Read: Sujeeth: ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంలో ఉండగానే..

Updated Date - Sep 22 , 2025 | 06:37 PM