Kanta Rao: నారదుడంటే కాంతారావే!
ABN , Publish Date - Apr 25 , 2025 | 09:58 AM
నటరత్న యన్టీఆర్ (NTR) తో కాంతారావుది విడదీయరాని సోదరబంధం. యన్టీఆర్ సొంత చిత్రం 'జయసింహ'లో వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. అప్పటి నుంచీ యన్టీఆర్ కాంతారావును సొంత తమ్మునిలాగే ఆదరించారు.
కాంతారావు (Kanta Rao)కు ముందు ఈలపాట రఘురామయ్యగా పేరొందిన కళ్యాణం రఘురామయ్య, సూరిబాబు, అక్కినేని నాగేశ్వరరావు, ఎ. ప్రకాశరావు, పద్మనాభం వంటివారు నారద పాత్ర (Narada's role)ను ధరించారు. ఆయన తరువాత రేలంగి, హరనాథ్, శోభన్ బాబు, నందమూరి బాలకృష్ణ, లవకుశ నాగరాజు, నరేశ్ వంటివారూ నారద పాత్రలో రాణించారు. అయితే నారద పాత్ర అనగానే తెలుగువారి మదిలో చప్పున మెదిలేది నటప్రపూర్ణ కాంతారావు అనే చెప్పాలి. నారద పాత్రలో కాంతారావు అభినయం నభూతో నభవిష్యతిగా సాగింది.
అసలు నారద పాత్రలో కాంతారావు ఎలా ప్రవేశించారంటే ...
నటరత్న యన్టీఆర్ (NTR) తో కాంతారావుది విడదీయరాని సోదరబంధం. యన్టీఆర్ సొంత చిత్రం 'జయసింహ'లో వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. అప్పటి నుంచీ యన్టీఆర్ కాంతారావును సొంత తమ్మునిలాగే ఆదరించారు. అలా తాను హీరోగా నటించిన అనేక చిత్రాలలో కాంతారావుకు వేషాలు ఇప్పిస్తూ సాగారు రామారావు. కాంతారావు నారద పాత్రకు సరిపోతారని భావించి యన్టీఆర్ తన 'సీతారామకళ్యాణం' (Seetarama Kalyanam) లో ఎంచుకున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణ పాత్రలో యన్టీఆర్ ను నటింపచేస్తూ రజనీకాంత్ దర్శకత్వంలో 'దీపావళి' (Deepavali) చిత్రం తెరకెక్కింది. అందులో కూడా నారద పాత్రకు కాంతారావును ఎంచుకున్నారు. 'సీతారామకళ్యాణం' షూటింగ్ ముందుగా ఆరంభమైనా, 'దీపావళి' చిత్రం ముందు విడుదలయింది. అలా 'దీపావళి'లో తొలిసారి నారద పాత్రలో కాంతారావు కనిపించారు. ఆ సినిమాలోనే నారదునిగా కాంతారావు జనం మదిలో నిలచిపోయారు. ఆ పై "సీతారామకళ్యాణం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీసత్యనారాయణ మహాత్మ్యం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణతులాభారం, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం" చిత్రాలలో నారదునిగా నటించి భళా అనిపించారు కాంతారావు. ఈ చిత్రాలన్నిటా యన్టీఆర్ కథానాయకుడు కావడం గమనార్హం! తెలుగునాట ఎందరు నారద పాత్రను ధరించినా, వారందరి కన్నా మిన్నగా ఆ పాత్రలో జీవించారు కాంతారావు. అందుకే ఈ నాటికీ జనం 'నారద పాత్ర' అనగానే కాంతారావునే గుర్తు చేసుకుంటూ ఉంటారు.