VIjay Bhanu: అమెరికాలో స్థిరపడినా.. సొంత గడ్డ మీదే కన్ను మూశారు..

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:35 PM

అలనాటి నటి విజయభాను (68) ఇక లేరు. ఏప్రిల్‌ నెలలో ఇండియా పర్యటనకు వచ్చారామె. చెన్నైలోని తన ఇంటిని చూసుకునెందుకు వెళ్లిన విజయభాను... ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై... అదే నెల 24న కన్ను మూశారు.

అలనాటి నటి విజయభాను (Vijaya Bhanu 68) ఇక లేరు. ఏప్రిల్‌ నెలలో ఇండియా పర్యటనకు వచ్చారామె. చెన్నైలోని తన ఇంటిని చూసుకునేందుకు వెళ్లిన విజయభాను... ఎండ వేడి తట్టుకోలేక వడదెబ్బకు లోనై... అదే నెల 24న కన్ను మూశారు. చెన్నైలో జరిగిన ఆమె దశదిన కర్మకు నటి జయప్రద హాజరై నివాళులు అర్పించారు. అలాగే విజయభాను ఆకస్మిక మృతి పట్ల నటుడు సుమన్‌, దర్శకనిర్మాత వై.వి.ఎస్‌.చౌదరి తదితరులు సంతాపం తెలిపారు.

విజయభాను గురించి... అమెరికలోనే స్థిరపడిన ఆమె సోదరి కలైమామణి డా. సింధూరి జయసింఘే తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘‘మా అక్క నిజంగా దేవత. ఒక పోరాట శక్తి. ఎన్నో కుటుంబాలకు ఆమె జీవనజ్యోతి. ఎందరికో ఆదర్శమూర్తి. ఆమెకు నివాళిగా... అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితంపై ఒక పుస్తకం తీసుకురావాలని మేము సంకల్పించాం. జయప్రదగారు మా అక్కకు చాలా సన్నిహితురాలు. చెన్నైలో నిర్వహించిన మా అక్క దశదినకర్మకు  కూడా వారు హాజరయ్యారు. మా అక్క ప్రేరణతోనే నేనూ అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడి... నేను కూడా డాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నాను. అక్కతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నవారందర్నీ కలిసి... అక్క పుస్తకాన్ని వీలైనంత సమగ్రంగా తీసుకు రావాలని భావిస్తున్నాను’’ అని అన్నారు.

ఆ జంటకు ఓ క్రేజ్‌..

అనంతపురం విజయభాను స్వస్థలం. అయితే ఆమె పుట్టింది, పెరిగింది, పేరు తెచ్చుకుంది చెన్నైలోనే! తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించారు విజయ. 70వ దశకంలో ఒక వెలుగు వెలిగి అప్పటి అగ్ర కథానాయకులందరి సినిమాల్లోనూ నటించారు. అప్పట్లో ‘‘రాజబాబు - విజయభాను జంటకు ఒక రేంజ్‌ లో క్రేజ్‌ ఉండేది. కేవలం పదేళ్ల కాలంలో వందకు పైగా సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే ఓ అమెరికన్‌తో ప్రేమలో పడి... కెరీర్‌తోపాటు ఇండియానూ విడిచిపెట్టి లాస్‌ ఏంజెల్స్‌ లో స్థిరపడ్డారు. స్వతహాగా ఆమె నాట్యకారిణి కావడంతోపాటు...’’నాట్యమయూరి’’ బిరుదాంకితురాలైన విజయభాను...లాస్‌ ఏంజెల్స్‌ లో ‘శ్రీ శక్తి శారదా నృత్యనికేతన్‌’ పేరుతో నృత్య కళాశాల స్థ్థాపించి, వేలాది మందికి తర్ఫీదు ఇచ్చారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్‌, కథాకేళి వంటి అన్ని నృత్యరీతులలోనూ నిష్ణ్ణాతురాలైన ఆమె ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ ఎవరు వెళ్లినా... విజయ భాను ఎంతో ఆత్మీయంగా ఆతిథ్యమిచ్చేవారు. అమెరికా కోడలిగా మారి, అక్కడే స్థిరపడినప్పటికీ.. అనంతపురంలో ఆమె మాతృమూర్తి కట్టించిన శివ నారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయం అభివృద్థికి ఎంతో సాయం చేశారు. తన సహాయం కోరి వచ్చిన వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపారు.

‘నాట్యమయూరి’ బిరుదుతో..
చిరంజీవి, కమల్‌ హాసన్‌, జయసుధతో కె. బాలచందర్‌ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’ చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఆ చిత్రంలో కనబరిచిన అత్యుత్తమ నటనకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నారు. నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ‘నాట్యమయూరి’ బిరుదునూ అందుకున్నారు. ‘‘నిప్పులాంటి మనిషి (ఎన్ఠీఆర్‌), ఇది కథ కాదు (చిరంజీవి - కమల్‌ హాసన్‌), కిలాడి బుల్లోడు (శోభన్‌ బాబు), ఒక నారి వంద తుపాకులు(విజయ లలిత), చందన రంగనాధ్‌ మొదటి చిత్రం), ప్రియబాంధవి (శారద), స్ర్తీ (కృష్ణంరాజు), శభాష్‌ పాపన్న (జగ్గయ్య), చిన్నికృష్ణుడు తదితర చిత్రాలు  విజయభాను పేరు ఆరోజుల్లో మారు మోగేలా చేశాయి

Updated Date - Jun 07 , 2025 | 04:36 PM