Tollywood: నటుడు జోష్ రవి ఇంట తీవ్ర విషాదం
ABN , Publish Date - Nov 18 , 2025 | 08:10 AM
యువ నటుడు జోష్ రవి తండ్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త మీడియాకు కాస్తంత ఆలస్యంగా తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులో ఆయన తుదిశ్వాస విడిచారు.
పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో యువ సినీ నటుడు జోష్ రవికు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సూర్య వెంకట నరసింహ శర్మ కు 'జోష్' రవి ఒక్కడే కొడుకు. 'జోష్' సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రవి పలు సినిమాలలోనూ, టీవీ కార్యక్రమాలలో అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నాడు.
మార్టేరు గ్రామంలో కార్తీక మాసం, నవంబర్ 10వ తేదీ మూడో సోమవారం సందర్భంగా శివాలయంలో అభిషేకాలు చేయడానికి వెళ్లిన సమయంలో రవి తండ్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు, అక్కడే కుప్పకూలి పోయారు. వెంటనే ఇంటికి వెళ్లే లోపు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే జోష్ రవి ఊరు వెళ్ళి, అతని కుటుంబ సభ్యులను తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు పరామర్శించి వచ్చారు.