Nagabala Suresh: టెలివిజన్ రంగానికి ఎఫ్.డి.సి. ఎండీ హామీ

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:02 PM

తెలుగు టెలివిజన్ రంగానికి సంబంధించిన సమస్యలను టీ.ఎస్.ఎఫ్‌.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక దృష్టికి నాగబాల సురేశ్‌ బృందం తీసుకెళ్ళింది. వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు.

TV Industry

తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలను తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రియాంక (Priyanka) దృష్టికి తీసుకెళ్ళారు. సమాచార్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ బాబు (Kishore Babu) సైతం పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలుగు టెలివిజన్ వర్కర్స్, టెక్నీషియన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేశ్‌ కుమార్ (Nagabala Suresh Kumar) సారధ్యం వహించారు. ఆయనతో పాటు టీవీ నటీనటులు అశోక్ కుమార్ (Ashok Kumar), జీ.యల్. శ్రీనివాస్ (G.L. Srinivas), లహరి, మధుప్రియ, మాణిక్, సూర్యకళతో పాటు దర్శకులు, రచయితల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ రాజ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగు తెలంగాణా సినీ టీవీ నటీనటల సంఘం అధ్యక్షులు రాజశేఖర్, గోపాలకృష్ణ, యం.ఎస్. ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సినీ, టీవీ గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు (Venigalla Rambabu), ఆర్.డి.ఎస్. ప్రకాశ్‌, అక్కినేని శ్రీధర్, లక్ష్మీ, భాస్కర్ల వాసు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


దూరదర్శన్ లో అరగంట చిత్రలహరి కార్యక్రమంతో మొదలైన తెలుగు దూరదర్శన్ కార్యక్రమాలు ఇవాళ 148 శాటిలైట్ ఛానెల్స్, 82 యు ట్యూబ్ ఛానెల్స్, 9 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో విస్తరించిందని, దీని ద్వారా సుమారు 20 వేల మంది ప్రత్యక్షంగా, 1.26 లక్షల మంది పరోక్షంగా జీవితాన్ని సాగిస్తున్నారని సురేశ్‌ కుమార్ తెలిపారు. ఈ రంగం ద్వారా ప్రభుత్వానికి టి.డి.ఎస్., జి.ఎస్.టీ. రూపంలో వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోందని, అయినా టెలివిజన్ రంగం మాత్రం ఉపాధి, ఆర్థిక వెసులు బాటు లేని స్థితిలో ఉందని వాపోయారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులకు, సాంకేతిక నిపుణులకు టీవీ నగర్ తో పాటు, ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని, జీవిత భీమా, ప్రమాద భీమాతో పాటు అరవై యేళ్ళు నిండిన వారికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని ఆయన కోరారు. అలానే టి.ఎల్. కాంతారావు, పైడి జయరాజ్ పేరుతో ప్రతి యేటా అవార్డులు ఇవ్వాలని, సెమినార్స్, వర్క్ షాప్స్ నిర్వహించాలని మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంకను కోరుతూ వినతి పత్రం అందించారు.


ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ, 'భారత దేశం లోనే కాక, ప్రపంచ స్తాయిలోనే చలన చిత్ర, టి.వి., ఓటిటిల నిర్మాణం రికార్డు స్తాయిలో జరుగుతున్నాయ'ని గుర్తు చేశారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అన్ని రంగాల మాదిరిగానే టి వి రంగాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తారని, త్వరలోనే ఈ విషయాన్నీ, ముఖ్యమంత్రి దృష్టికి, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులకు, తెలంగాణా రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు దృష్టికి తీసుకు వెళతానని, టివి నగర్, జీవిత భీమా, ప్రమాద భీమా, పెన్షన్ వంటి సదుపాయాలు అందించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత 'లక్ష్మణ రేఖ' గోపాలకృష్ణ రచించిన 'టెలివిజన్ చరిత్ర' పుస్తక ఆవిష్కరణ, బుస్సా బాలరాజు నిర్వహణలో త్వరలో జరుగనున్న ఫిలిమ్, టెలివిజన్ అవార్డుల బ్రోచర్ ను ఆవిష్కరించారు.

Updated Date - Oct 24 , 2025 | 06:06 PM