Trivikram Srinivas: ఈ తరం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్

ABN , Publish Date - Nov 07 , 2025 | 02:50 PM

మాటలతో మాయ చేస్తూ - దర్శకత్వంతో ఆకర్షిస్తూ సాగుతున్నారు త్రివిక్రమ్. నవ్వులు పూయించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న త్రివిక్రమ్ నవంబర్ 7న బర్త్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విషెస్ చెబుతూ త్రివిక్రమ్ బాణీని గుర్తు చేసుకుందాం.

Trivikram Srinivas

'విచారానికి విరుగుడు వినోదమే' అంటూ విజయాసంస్థ తెలుగువారికి పలు వినోదభరిత చిత్రాలను అందించింది. సదరు చిత్రాలకు తన రచనతో మాయ చేసిన ఘనుడు పింగళి నాగేంద్రరావు. ఆయనను అందరూ మాటల మాంత్రికుడు అంటూ పిలిచేవారు. ఆ తరువాత ఆ ట్యాగ్ ను అందుకున్న రచయిత ఎవరంటే త్రివిక్రమ్ (Trivikram) అనే చెప్పాలి. త్రివిక్రమ్ కూడా తన చిత్రాల్లో వినోదానికే పెద్ద పీట వేస్తూ సాగుతూ ఉంటారు. కథలోని ప్రధానాంశం ఏదైనా, దాని చుట్టూ వినోదాన్ని అల్లడం త్రివిక్రమ్ బాణీగా నిలచింది. మహేశ్ బాబు (Mahesh Babu)తో ఒకప్పుడు త్రివిక్రమ్ రూపొందించిన 'ఖలేజా' (Khaleja) అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ మధ్యే 'ఖలేజా'ను రీ-రిలీజ్ చేయగా, ఆ సినిమా భారీ వసూళ్ళు చూడడం విశేషం. అంటే- ఈ తరం వారిని ఆకర్షించే వినోదాన్ని త్రివిక్రమ్ ముందుగానే ఊహించారన్న మాట! అందుకే ఆయనను మాటల మాంత్రికుడు అంటారు మరి- అని అభిమానులు బల్లాగుద్ది చెబుతారు.


పాత కథలకు కొత్త నగిషీలు అద్ది మరీ ప్రేక్షకులను అలరించడంలో త్రివిక్రమ్ ముందుంటారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. త్రివిక్రమ్ సినిమాల్లో కొత్తదనం ఉండదని కొందరంటూ ఉంటారు. అయినా జనం మాత్రం ఆయన సినిమాలను ఒక్కసారయినా చూడాలని తపిస్తూ ఉంటారు. అదే త్రివిక్రమ్ మ్యాజిక్ అని చెప్పవచ్చు. తొలి సినిమా 'నువ్వే నువ్వే' (Nuvve Nuvve) తోనే త్రివిక్రమ్ బాణీకి జనం జై కొట్టారు. ఆ తరువాత 'అతడు' (Athadu) చిత్రాన్ని జనం ముందు నిలిపారు త్రివిక్రమ్. సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఈ మూవీ అప్పట్లో థియేటర్లలోకన్నా మిన్నగా బుల్లితెరపై సందడి చేసింది. పవన్ కళ్యాణ్ కు తన 'జల్సా' (Jalsa) తో ఓ బ్లాక్ బస్టర్ అందించిన త్రివిక్రమ్ ఆ పై అదే పవన్ తో 'అత్తారింటికి దారేది' (Atharintiki Daaredi) వంటి సూపర్ డూపర్ హిట్ నూ రూపొందించారు. ఈ రెండు సినిమాలతో పవన్ కు అత్యంత సన్నిహితుడై పోయారు త్రివిక్రమ్.


త్రివిక్రమ్ మ్యాజిక్ ఏంటో ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరికీ బాగా తెలుసు. అందువల్లే త్రివిక్రమ్ సినిమాల్లో నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ యన్టీఆర్, నితిన్ వంటి హీరోలతో సక్సెస్ రూటులో సాగారు త్రివిక్రమ్. వీరిలో మహేశ్, పవన్, అల్లు అర్జున్ ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు రూపొందించారు. అల్లు అర్జున్ (Allu Arjun) తో మూడు సినిమాలతోనూ విజయాన్నిఅందుకొని హ్యాట్రిక్ సాధించారు త్రివిక్రమ్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన వెంకటేశ్ తో సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో సీనియర్ స్టార్ కు సైతం మంచి విజయాన్ని అందిస్తారు త్రివిక్రమ్ అని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే యేడాది వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబోలో రూపొందే మూవీ వెలుగు చూడనుంది. మరి యంగ్ హీరోస్ తో అలరించిన త్రివిక్రమ్ సీనియర్ స్టార్ ను ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

Also Read: Jatadhara Movie: జటాధర మూవీ రివ్యూ

Also Read: The Girlfriend Movie: రష్మిక మందణ్ణ.. ది గర్ల్‌ ఫ్రెండ్‌ మూవీ రివ్యూ! సినిమా ఎలా ఉందంటే?

Updated Date - Nov 07 , 2025 | 06:38 PM