Telugu: నేడు తెలుగు భాషా దినోత్సవం

ABN , Publish Date - Aug 29 , 2025 | 04:29 PM

ఎవరి మాతృభాష వారికి గొప్ప. ఆంగ్ల ప్రభావంతో పలు భాషలు కనుమరుగై పోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి భాష తన ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది. అందుకే ప్రతి భాషకూ ఓ దినోత్సవం వెలసింది. నేడు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు వెలుగును గుర్తు చేసుకుందాం.

Telugu Bhasha Dinostavam

వ్యావహారిక భాష కోసం పోరాటం చేసిన ఘనుడు గిడుగు వేంకట రామమూర్తి పంతులు (Gidugu Venkata Ramamoorthy Panthulu). ఆయన జన్మించిన ఆగస్టు 29వ తేదీని 'తెలుగు భాషా దినోత్సవం' (Telugu Bhasha Dinostavam) గా పరిగణిస్తున్నారు.. మన తెలుగునేలపై 'తెలుగు భాషాదినోత్సవాన్ని' గుర్తు చేసుకొనేవారు ఎందరో కానీ, విదేశాల్లోని తెలుగువారు మాత్రం ఆగస్టు 29వ తేదీన మాతృభాషను మరవకుండా జరుపుకుంటున్నారు. విదేశాల్లోని మాతృభాషాభిమానులను చూస్తే మది పులకించి పోతుంది. తెలుగు భాషలోని తీయదనాన్ని తెలుసుకొని విదేశీయులు సైతం ఆ మధురామృతంతో సాగుతున్నారు. వారి స్ఫూర్తితో భావితరాల తెలుగువారు కూడా సాగాలని భాషాభిమానులు ఆశిస్తున్నారు.


తెలుగు అజంతా భాష- అందులోని మాధుర్యాన్ని సి.పి.బ్రౌన్ వంటి ఆంగ్లేయులు సైతం చవిచూసి ఆనందించారు. పరభాషల వారు సైతం తెలుగును నేర్చుకొని మన భాషలో పాటలు పలికించి ఆనందించిన సందర్భాలున్నాయి. అంతటి మాధుర్యం గల తెలుగు మన మాతృభాషగా లభించడం పూర్వ జన్మ సుకృతం అనుకొనేవారు ఎందరో ఉన్నారు. వారందరూ తెలుగుపాటతో వెలుగుబాటలో సాగాలనే తపించారు.


తెలుగదేల యన్న దేశంబు తెలుగు అంటూ చాటిన కర్ణాటాంధ్ర ప్రభువు శ్రీకృష్ణ దేవరాయలు మొదలు ఎందరో మన మాతృభాషకు పట్టం కట్టారు. తెలుగువారి ఘనకీర్తిని దశదిశలా ప్రసరింప చేశారెందరో భాషాభిమానులు. తెలుగునాట ఆ దిశగా సాగిన వారిలో ఈ తరం వారికి సైతం గుర్తుకు వచ్చేది మహానటుడు, మహానాయకుడు యన్టీఆర్ (NTR) అనే చెప్పాలి. తెలుగుజాతి మనది అంటూ గర్వంగా జగతికి చాటిన ఘనుడు యన్టీఆర్ - తన రాజకీయ పార్టీకి 'తెలుగుదేశం' అని నామకరణం చేసి, తెలుగు అన్న పదాన్ని ప్రపంచమంతా పలికేలా చేసిన ఘనత కూడా ఆయనదే. భాషాభిమానులు తెలుగు భాషాదినోత్సవాన అలాంటి వారిని అందరినీ సదా స్మరించుకుంటారని ఆశిద్దాం.

Also Read: Hero Vijay: ఇళయ దళపతిని ఇరుకున పెట్టే ప్రయత్నం

Also Read: Tribanadhari Barbarik Review: 'త్రిబాణధారి బార్బరిక్‌' సినిమా మెప్పించిందా..

Updated Date - Aug 29 , 2025 | 04:29 PM