Prathysha Case: నటి ప్రత్యూష మృతి కేసు... తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీమ్ కోర్ట్
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:37 AM
ప్రత్యూష కేసులో తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ లో పెట్టింది. 23 సంవత్సరాల క్రితం ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ప్రత్యూష చనిపోగా, సిద్ధార్థ్ బతికి బయటపడ్డాడు.
తెలుగు సినీ వినీలాకాశంలోకి తారాజువ్వలా దూసుకు వెళుతున్న తరుణంలో నటి ప్రత్యూష (Prathysha) ను ప్రేమపాశం నింగి నుండి నేలకు దించేసింది. అంతేకాదు... మట్టిలో కలిసి పోయేలా చేసింది. ఇది జరిగి 23 సంవత్సరాలు గడిపోయింది. ఇంటర్మీడియట్ చదువుతుండగా ప్రేమలో పడిన ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఆ తర్వాత వేర్వేరు రంగాల్లోకి వెళ్ళిపోయారు.
ప్రత్యూష నటిగా కెరీర్ ప్రారంభించగా, సిద్ధార్థ్ ఇంజనీరింగ్ లో చేరాడు. కారణాలు ఏవైనా... వీరిద్దరూ 2002 ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి విషయం తాగి హాస్పిటల్ లో చేరారు. ప్రత్యూష ఆ మర్నాడు కన్నుమూయగా, సిద్ధార్థ్ చికిత్సానంతరం మార్చి 9వ తేదీ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద చార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష, ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ 2004లో తీర్పు చెప్పారు. దీనిపై నిందితుడు హైకోర్ట్ ను ఆశ్రయించగా 2011లో జైలు శిక్షను రెండేళ్ళకు తగ్గిస్తూ, జరిమానాను రూ. 5 వేలకు పెంచుతూ తీర్పు ఇచ్చారు.
దీనిపై ఇటు సిద్ధార్థ్ రెడ్డి, అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా వాదనలను విన్న జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్ లతో కూడాఇన సుప్రీమ్ కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించింది. సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత జోషి 'ప్రత్యూష ఆత్మహత్య చేసుకొనేలా ఉసిగొల్పినందన సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, అది సాధ్యం కాకపోతే సెక్షన్ 306 కింద గరిష్ఠ శిక్ష విధించాలని కోర్టును కోరారు. నిందితుడి తరఫు న్యాయవాదులు నాగముత్తు, ఎల్. నరసింహారెడ్డి 'మృతురాలు, నిందితుడు ఇద్దరూ కలిసి పురుగు మందు తీసుకున్నందువల్ల ఇది ఆత్మహత్యకు ఉసిగొల్పడం కిందకు రాద'ని తమ వాదనలు వినిపించారు.
Also Read: Manya Anand: ఆ వార్తలు ఫేక్.. ధనుష్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు
Also Read: Nayanthara: నయనతార బర్త్‌డే గిఫ్ట్.. రూ.10 కోట్ల లగ్జరీ కారు